
స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలి
తిరువళ్లూరు: ప్రైవేటు మైక్రో ఫైనాన్స్ రుణాలు పొంది వేధింపులు తాళలేక ఎస్టీ కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఎస్టీ గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, వారికి రుణాలను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. వివరాలు..తిరువళ్లూరు సమీపంలోని మప్పేడులో తమిళనాడు ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహానాడు కామ్రేడ్ మణిగండన్ మెమోరియల్ హాలులో జరిగింది. జిల్లా అధ్యక్షుడు చిన్నదురై అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర అద్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఢిల్లీబాబు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఢిల్లీబాబు మాట్లాడుతూ ఎస్టీ కాలనీలోని మహిళలు మైక్రో ఫైనాన్స్, కందు వడ్డీ తీసుకుని తిరిగి చెల్లించలేక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఎస్టీ కాలనీల్లో మహిళలను స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వాలని కోరారు. అర్హులైన వారికి ఇంటి పట్టాలు, గృహాలు నిర్మించాలన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా తమిళరసు, అధ్యక్షుడిగా చిన్నదురై, కోశాధికారిగా చెంచమ్మ తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం మహానాడులో పలు తీర్మానాలు చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.