
ఆ పాత్రలో నటిస్తే.. విమర్శలు తప్పవా?
తమిళసినిమా: సినీ రంగంలో మహా సాధ్వి సీతాదేవి పాత్రను ఎవరు పోషించినా విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఆ మధ్య తెలుగు చిత్రం శ్రీరామరాజ్యం చిత్రంలో సీతగా నటి నయనతార నటించడాన్ని కొందరు తీవ్రంగా విమర్శించారు. సాంగీక చిత్రాల్లో అందాలను విచ్చల విడిగా ఆరబోసిన ఈమె ఏంటీ సీతాదేవిగా నటించడం ఏమిటీ అని విమర్శించారు. అయితే ఆ చిత్రం విడుదలయిన తరువాత సీతగా నయనతార ఒదిగిపోయారు అనే ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా బాలీవుడ్ భామ కృతీసనన్ నటించినప్పుడూ ఆమె గురించి ట్రోలింగ్ చేశారు. ఆ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కాబట్టి ఆ విమర్శల్లో అర్థం ఉందనుకుందాం. కానీ ఇప్పుడు నటి సాయిపల్లవిపై కూడా విమర్శలు చేయడమే చర్చనీయాంశంగా మారింది. ఆది నుంచి సహజత్వానికి ప్రాముఖ్యత నిస్తున్న నటి సాయిపల్లవి. పదాలకు లిప్‌స్టిక్ వేసుకోవడానికి కూడా సందేహించే నటి ఈమె. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ప్రాణం పెట్టి నటించే సాయిపల్లవి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్‌కు గురౌతున్నారనిపిస్తోంది. రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటి సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. సీతాదేవిగా ఆమె నటించడం రామాయణం కావ్యాన్నే అవమానపరిచినట్లు అని విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఆ చిత్రంలో శూర్పణక పాత్రలో నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి నటి సాయిపల్లవిపైనా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రామాయణ చిత్రంలో రాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్, యష్ రావణాసురుడిగా నటించిన కొన్ని సన్నివేశాలు విడుదలయిన తరువాత ట్రోలింగ్స్ అధికం అవుతున్నాయి. అయితే ఎలాంటి విమర్శలను పట్టించుకోకుండా నటి సాయిపల్లవి తన నటనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కారణం చిత్రం విడుదలైన తరువాత తన నటనే అలాంటి వారికి సమాధానం చెబుతుందనే ఆమె ధైర్యం కావచ్చు.