
అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం
సాక్షి, చైన్నె : రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న దాత, గ్రహీత మధ్య అరుదైన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్ వైద్యులు విజయవంతం చేశారు. అధునాతన ఇమ్యునో అడ్సార్ప్షన్ థెరపీని ఉపయోగించి ఈ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించామని బుధవారం వైద్యులు ప్రకటించారు. చైన్నెకి చెందిన జోసెఫ్ రాజ్ దీర్ఘకాలికంగా మూత్రపిండ వ్యాధితో బాధ పడుతూ వచ్చాడు. వ్యాధి చివరి దశలో మూత్రపిండ వైఫల్యానికి దారితీసింది. దీంతో గత మూడు సంవత్సరాలుగా తన ఉద్యోగాన్ని వదిలి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవలసి వచ్చింది. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైంది. జోసెఫ్ తండ్రి తన కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా, ఇద్దరి రక్త గ్రూపులు వేర్వేరు కావడంతో అత్యాధునిక విధానం అనుసరించి శస్త్ర చికిత్సకు వైద్యులు సిద్ధమయ్యారు. కేసు సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకుని, ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి 14 రోజుల ముందు ఒక ప్రత్యేకమైన డీసెన్సిటైజేషన్ ప్రొటోకాల్‌ను అనుసరించారు. ఇందులో ఇమ్యునో అడ్సార్ప్షన్ వాడకం కూడా ఉంది, శస్త్రచికిత్సకు దాదాపు 24 గంటల ముందు యాంటీబాడీ టైటర్‌ను సురక్షిత స్థాయికి విజయవంతంగా తగ్గించి. ఆ తర్వాత మార్పిడిని నిర్వహించారు, యాంటీబాడీ టైటర్‌లు మళ్లీ పెరిగినప్పుడు, రెండవ ఇమ్యునో అడ్సార్షన్ సెషన్‌ను వెంటనే నిర్వహించారు. రోగి ఎనిమిదవ రోజున స్థిరమైన స్థితిలో, సాధారణ క్రియేటినిన్ స్థాయితో డిశ్చార్జ్ చేశారు. ఈ అరుదైన మార్పిడి శస్త్ర చికిత్సకు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాథ్యూ గెర్రీ జార్జ్, యూరాలజిస్టు డాక్టర్ దీపక్ నాయకత్వం వహించారు. ఎస్‌ఆర్‌ఎం గ్లోబల్ ఆస్పత్రి అధ్యక్షుడు డాక్టర్ పి. సత్యనారాయణన్ ఈ సందర్భంగా మట్లాడుతూ, ఈ అసాధరణ కేసు తమ వైద్యుల బృందం, క్లినికల్ ఎక్సలెన్స్‌కు దర్పణంగా వ్యాఖ్యలు చేశారు.