
ప్రారంభ దశలో గుర్తిస్తే విముక్తి
కొరుక్కుపేట: మహిళల్లో వచ్చే అండాశయ, గర్భాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా విముక్తి పొందవచ్చునని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అపోలో వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈమేరకు బుధవారం చైన్నెలో ఏర్పాటైన కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ కొత్తగా ‘ఎండ్–ఓ చెక్’ను లాంచనంగా ప్రారంభించింది. అపోలో క్యాన్సర్ సెంటర్ –తేనాంపేట సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ వెంకట్ పి మాట్లాడుతూ ఆంకాలజీ పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేస్తూ, అపోలో క్యాన్సర్ సెంటర్ (ఏసీసీ), అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ (ఏపీసీసీ), మహిళలను లక్ష్యంగా చేసుకుని సమగ్ర ముందస్తు గుర్తింపు కార్యక్రమమైన ఎండ్–ఓ చెక్‌ను ప్రారంభించామని తెలిపారు. అపోలో క్యాన్సర్ సెంటర్ , అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ ఒక ప్యానెల్ చర్చను నిర్వహించారు. ఇందులో వైద్యులు అజిత్‌పాయ్, డాక్టర్ వెంకట్ పి, డాక్టర్ ప్రియాకపూర్, డాక్టర్ కుమార్ గుబ్బల, డాక్టర్ మధుప్రియ చర్చలో పాల్గొన్నారు.