ఫుట్‌పాత్‌ కబ్జా..జనం నడిచేదెట్లా? | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌పాత్‌ కబ్జా..జనం నడిచేదెట్లా?

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు

సూర్యాపేటటౌన్‌ : జిల్లా కేంద్రంలో కొందరు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో పాదచారులు నడిచేందుకు దారిలేకుండా పోతోంది. పట్టణంలో ఇప్పటికే వాహనాల రద్దీ అధికమవగా, రోడ్‌సైట్‌ స్థలాలను ఆక్రమించుకుంటుండడంతో ట్రాఫిక్‌ సమస్య మరింత జఠిలమవుతోంది. ప్రమా దాలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయమై సంబంధిత అధికారులెవరూ పట్టించుకోక పోవడంతో ప్రజ లు, వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్లపైకి వచ్చి మరీ వ్యాపారం

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు పలు పనులు నిమిత్తం సూర్యాపేటకు వస్తుంటారు. దాంతో అన్ని దారులూ రద్దీగా ఉంటాయి. దానికి తోడు కొందరు రోడ్డుపైకి వచ్చి మరీ వ్యాపారాలు సాగిస్తుండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. పట్టణంలోని శంకర్‌విలాస్‌ నుంచి కొత్త బస్టాండ్‌ రోడ్డు, పూల సెంటర్‌ రోడ్డుతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ఫుట్‌పాత్‌లపై దుకాణాలు ఏర్పాటు చేశారు. దానికి తోడు షాపుల ముందు సరుకులు పెట్టడం వల్ల పాదచారులకు దారి లేకుండా పోతోంది. దాంతో వారు రోడ్డుపైకి రావాల్సి వస్తోంది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తనిఖీలు లేకపోవడంతో..

ఫుట్‌పాత్‌లను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావడం, ట్రేడ్‌ లైసెన్సులపై ప్రత్యేక తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘించే దుకాణా దారులపై చర్యలు వంటి విషయాలను మున్సిపల్‌ అధికారులు పట్టించుకోక పోవడంతోనే ఎవరికిష్టమైన ప్రాంతంలో వారు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఖమ్మం రోడ్డులో మెప్మా ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాలు సైతం ఖాళీగా ఉన్నాయి. రోడ్లపై ఉన్న వారిని అటువైపు మళ్లించినా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ట్రేడ్‌ లైసెన్స్‌ల విషయంలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మున్సిపాలిటీ ఆదాయానికి గండి

ఫుట్‌పాత్‌లపై దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్న వారి నుంచి వెనుక ఉన్న దుకాణా దారులు అద్దె వసూలు చేసుకుంటున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో కొందరు ఫుట్‌పాత్‌లపై డబ్బాలు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసి ఆక్రమించి మరీ ఇతరులకు అద్దెకు ఇస్తున్నట్లు సమాచారం. ఫలి తంగా మున్సిపాలిటీ ఆదాయం ఇతరులు కొట్టేస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోంది. మున్సి పాలిటీ పరిధిలో ఫుట్‌పాత్‌లపై దుకాణాలు ఏర్పాటు చేసుకున్న 6,537 మంది ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకోగా.. లైసెన్స్‌ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న దుకాణాలు అనేకం ఉన్నాయి.

యథేచ్ఛగా ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు

ప్రమాదాలకు గురవుతున్న పాదచారులు

పలు ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమించడంతో

తరచూ ట్రాఫిక్‌ జామ్‌

ఫుట్‌పాత్‌లపై దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు ఖచ్చితంగా ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలి. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపై వ్యాపారాలు నిర్వహిస్తే షాపులు తీయించేస్తాం. ఖమ్మం రోడ్డులో మెప్మా ఆధ్వర్యంలో పండ్ల వ్యాపారుల కోసం దుకాణాలు ఏర్పాటు చేశారు. అవి కూడా వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం.

– సీహెచ్‌.హన్మంతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement