ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఊరెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలి

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

సూర్యాపేట (సూర్యాపేటటౌన్‌) : దసరా పండుగకు స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇళ్ల భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ నరసింహ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటికి తాళం వేసి వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నమ్మకమైన ఇరుగు, పొరుగు వారికి ఇంటి బాధ్యతలు అప్పగించాలన్నారు. కిటికీలు మూసి ఉంచాలని, తలుపులకు పటిష్టమైన తాళం వేయాలని, ఇంట్లో సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దని, ప్రయాణ వివరాలను సోషల్‌ మీడియాలో వెల్లడించ వద్దన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పెండింగ్‌ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్‌, రవి, సీఐలు, ఎస్‌ఐలు, అధికారులు పాల్గొన్నారు.

అన్‌నోన్‌ మెసేజ్‌లకు స్పందించొద్దు

గుర్తు తెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌లు, బ్యాంకు లావాదేవీల సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ‘మీ ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అయ్యాయి.. మీరు చేయకపోతే నో అని రిప్లై ఇవ్వండి’ అంటూ సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారని హెచ్చరించారు. ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్‌ చేయవద్దని సూచించారు. ఖాతాలో లావాదేవీలను బ్యాంకు అధికారిక యాప్‌లోనే తనిఖీ చేసుకోవాలని, ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎవరికీ చెప్పవద్దని స్పష్టం చేశారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.

ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement