జనరేటర్ల బాట | - | Sakshi
Sakshi News home page

జనరేటర్ల బాట

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

కరెంట్‌ కట్‌కట..

సూర్యాపేట(ఆత్మకూర్‌.ఎస్‌), మునగాల : వర్షాభావ పరిస్థితులతో ఈ సంవత్సరం ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాలువలకు నీరు విడుదల కాలేదు. దాంతో రైతులు బోర్ల కింద వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ కోతల కారణంగా పంట చేలకు నీరందక చేను ఎండి పోతుండడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పంటలను రక్షించుకునేందుకు జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ జనరేటర్లను అద్దెకు తీసుకు వచ్చి బోర్ల ద్వారా పంట చేలకు నీటిని అందిస్తున్నారు.

ఎస్సారెస్పీ ఆయకట్టులోనూ..

ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్న ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానాకాలం సీజన్‌లో కాలువల ద్వారా సాగునీరు విడుదల కాక పోయినప్పటికీ రైతులు బోర్ల సుమారు 30 వేల ఎకరాలలో వరి సాగు చేపట్టారు. కానీ ప్రస్తుతం విద్యుత్‌ కేవలం 9 గంటలు కూడా ఇవ్వకుండా ఉండగా.. అందులోనూ అనధికారికంగా కోతలు విధిస్తుండడంతో సాగునీరందని పరిస్థితి నెలకొంది. దాంతో మండలంలో సుమారు 600 ఎకరాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనధికార కోతలే..

గతంలో వ్యవసాయానికి నిరంతర కరెంట్‌ అందిస్తుండడంతో అదే ఆశతో రైతులు బోర్ల కింద సాగు చేశారు. కానీ ప్రస్తుతం రోజుకు కేవలం 9 గంటలు మాత్రమే అదికూడా రెండు విడుతలుగా కరెంట్‌ ఇస్తున్నారని, అందులోనూ అనధికారికంగా కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతులు వరుస తడులతో కుస్తీ పడుతున్నారు. అనధికార విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యతో పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనరేటర్లతో కుస్తీ...

కరెంటు కోతలతో వరి పంటకు తడులు పెట్టలేని పరిస్థితుల్లో.. సాగు చేసిన వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. జనరేటర్లను అద్దెకు తీసుకొచ్చి వాటి ద్వారా మోటార్లు నడుపుతూ సాగును కొనసాగిస్తున్నారు. దాంతో పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మునగాల మండలంలో..

మునగాల మండలంలో వానాకాలం సీజన్‌లో 16200 ఎకరాలలో వరి సాగు చేపట్టారు. ప్రారంభంలో బోర్లు బాగానే పోసినా ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గి పోయాయి. ఉన్న కొద్దినీటిని వినియోగించుకుందామంటే విద్యుత్‌ కోతలతో పరిస్థితి దయనీయంగా మారిందని, చేలకు సాగునీరందని పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు. దాంతో సుమారు 200 ఎకరాల్లో వరి చేలు ఎండిపోయే దశకు చేరాయి. పంట ఎదిగి కీలకదశలో సాగునీరు అందకపోవడంతో దిగుబడులపై ప్రభావం పడే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.

విద్యుత్‌ కోతలతో ఎండుతున్న వరి చేలు

పొట్టదశలో ఉన్న పంటను రక్షించుకునేందుకు రైతుల పాట్లు

డీసిల్‌, జనరేటర్‌ ఖర్చులతో పెరుగుతున్న పెట్టుబడులు

రూ.లక్ష ఖర్చుతో జనరేటర్‌ కొనుగోలు

ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నసీంపేటకు చెందిన రైతు పట్టిపల్లి శ్రీను తనకున్న పొలంలో వరి సాగు చేశాడు. కరెంట్‌ కోతలు, లోవోల్టేజీతో మోటార్లు నడవక పొలానికి నీళ్లు పారడం లేదు. దాంతో పంటను కాపాడుకోవడానికి రూ.లక్ష ఖర్చుపెట్టి ట్రాక్టర్‌ జనరేటర్‌ను తెచ్చి నడిపిస్తున్నాడు. దీనిని నడిపించేందుకు గంటకు రెండు లీటర్ల చొప్పున డీజిల్‌ ఖర్చు అవుతోంది. రోజూ డీజిల్‌ కోసమే రూ.1500 నుంచి రూ.2వేల వరకు అవుతోందని రైతు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement