సూర్యాపేట(భానుపురి) : ఉపాధి హామీ పనుల్లో కూలీలను సమీకరించి, పర్యవేక్షించే మేట్ల నియామకంలో ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పని ప్రదేశంలో కూలీల సంఖ్య ఆధారంగానే మేట్లను కేటాయించనున్నారు. ప్రతి 20 మంది కూలీలకు ఒక మేట్‌ను, 40 మంది వరకు ఉంటే ఇద్దరిని, అంతకంటే ఎక్కువ ఉంటే అదనంగా మేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో ఇలా..
సూర్యాపేట జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల్లో వీబీజీ రాంజీ కింద 2.63 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 405 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 3,379 మంది మేట్లు పనిచేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, యాక్టివ్‌గా ఉన్న కూలీల సంఖ్యను బట్టి మేట్ల నియామకాలు జరగనున్నాయి.
పెరిగిన బాధ్యతలు
ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్గదర్శకాలతో మేట్ల బాధ్యతలు మరింత పెరిగాయి. కూలీలకు పని చూపించడం, పని ప్రదేశంలో కొలతల గుర్తులు వేయడంతో పాటు ఎన్ఎంఎంఎస్ యాప్, భౌతిక మస్టర్ రోల్ ద్వారా ప్రతిరోజు డిజిటల్ హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు రోజువారి కొలతలు నమోదు చేయడం, ఫీల్డ్ మెజర్ మెంట్ బుక్ నిర్వహణ, కూలీల పని వివరాలు, పొందిన వేతనాన్ని ఉపాధి కార్డుల్లో నమోదు చేయడం చేయాల్సి ఉంటుంది. దాంతో మేట్లు ప్రభుత్వానికి, కూలీలకు మధ్య కీలక అనుసంధానకర్తగా మారనున్నారు.
ఎంపిక ప్రక్రియ ఇలా..
ఆండ్రాయిడ్ మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, ఎన్ఎంఎంఎస్ యాప్‌లో హాజరు నమోదు చేసే సామర్థ్యం ఉన్న కూలీలనే మేట్లుగా గుర్తించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రోగ్రామ్ అధికారి పరిశీలించి ఆమోదించిన తర్వాత వారిని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి, యాప్ వినియోగంపై శిక్షణ ఇస్తారు. కేంద్ర ఎస్వోపీ ప్రకారం.. పని స్థలంలోనే జియోట్యాగింగ్, సమయ నమోదుతో పాటు ఫేస్ అథెంటికేషన్ ద్వారా డిజిటల్ హాజరు తీసుకోవాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్యల వల్ల అథెంటికేషనన్ విఫలమైతే నిర్దేశిత మినహాయింపు విధానాన్ని పాటిస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 3 రోజుల్లోగా సాంకేతిక సిబ్బంది కొలతలు పూర్తి చేసి డిజిటల్‌గా నమోదు చేశాకే వేతనాల జాబితా రూపొందుతుంది.
మహిళలకే మొదటి ప్రాధాన్యం..
మేట్ల ఎంపికలో మహిళా కూలీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉపాధి పనుల్లో అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న మహిళలకు ఈ అవకాశం కల్పిస్తారు. కొత్త ఎస్వోపీ ప్రకారం వీరికి ప్రత్యేక ఈ–మస్టర్ జారీ చేసి, వేతనాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు.
20 మంది కూలీలకు ఒకరు, 40 మంది దాటితే ఇద్దరు నియామకం
పని ప్రదేశంలో డిజిటల్ పర్యవేక్షణ
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
వీబీజీ రాంజీలో పెరిగిన మేట్ల బాధ్యత


