సూర్యాపేట (సూర్యాపేటటౌన్) : ప్రజా ఫిర్యాదులపై పోలీసులు వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.
21 నుంచి పోలీస్ ఫ్లాగ్ డే
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 21 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహించనున్నట్లు ఎస్పీ కె. నరసింహ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21న జిల్లా పోలీస్ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, ఓపెన్ హౌస్ ద్వారా పోలీసుల విధులు, సేవలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణ, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు.


