యూజీడీ.. అధ్వానం! | - | Sakshi
Sakshi News home page

యూజీడీ.. అధ్వానం!

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

ఇబ్బంది లేకుండా పనులు చేయాలి

కోదాడ పట్టణంలో యూజీడీ పనులను పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపట్టాలి. తవ్విన సీసీ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. మున్సి పల్‌ అధి కారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని కాంట్రాక్టర్‌ పనులు చేయించాలి.

– పొడుగు హుస్సేన్‌, పన్ను చెల్లింపుదారుల సంఘం అధ్యక్షుడు

●

కోదాడ : కోదాడ పట్టణంలో కొద్దిరోజులుగా చేస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ (యూజీడీ) పనులు అధ్వానంగా మారాయి. ప్రస్తుతం శివారు కాలనీలలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. క్రమపద్ధతిలో చేయాల్సిన పనులను కాంట్రాక్టర్‌ ఇష్టానురీతిగా చేయిస్తున్నారు. ఈ పనులపై మున్సిపల్‌ అధికారులకు కనీస అవగాహన లేకపోవడంతో ఎక్కడ ఏమి జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పటిష్టంగా ఉన్న సీసీ రోడ్లను అడ్డంగా తవ్వుతున్న కాంట్రాక్టర్‌ వాటిని పురుద్ధరించకుండా మట్టిని రోడ్డు మధ్యలోనే వదిలేస్తున్నాడు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

మట్టి రోడ్లకన్నా దారుణం

కోదాడ పట్టణంలో రూ.240 కోట్ల అంచనా వ్యయంతో రెండు నెలల క్రితం అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు చేపట్టారు. మొదట కట్టకొమ్ముగూడెం రోడ్డులోని పెరిక హాస్టల్‌ నుంచి రెడ్‌చిల్లీ రెస్టారెంట్‌ వెనుకభాగం వరకు సీసీ రోడ్లను మధ్యలో తవ్వి డ్రెయినేజీ పైపులను అమర్చిన కాంట్రాక్టర్‌ ఆ తరువాత రోడ్డును చదును చేయకుండా వదిలేశాడు. సీసీ రోడ్డు మధ్యలో మట్టి గాడులు రావడం ఇటీవల కురిసిన వర్షానికి అది కుంగడంతో ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి దాపురించింది.

తవ్విన గాతులు సరిగ్గా పూడ్చక..

పట్టణ పరిధిలోని గుడబండ రోడ్డులో ఉన్న గోపిరెడ్డి నగర్‌లో కొంతభాగం వరకే సీసీ రోడ్లు ఉన్నాయి. ఇటీవల ఈ కాలనీలో యూజీడీ పనులను చేసిన కాంట్రాక్టర్‌ పైపులు అమర్చిన అనంతరం గాతులను సక్రమంగా పూడ్చకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ కాంట్రాక్టర్‌ ఎక్కడ పనులు చేస్తున్నాడో ఎలా.. చేస్తున్నాడో మాకే అర్థం కావడం లేదని అంటున్నారని వారు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎవరి ఇంటిముందు వారే బాగు చేసుకుంటున్నామని వారు అంటున్నారు.

ఎత్తుగా మ్యాన్‌హోల్స్‌

పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో సంత వెనుక ఇటీవల సీసీ రోడ్లను తవ్విన కాంట్రాక్టర్‌ మట్టి మొత్తాన్ని రోడ్డుమీదే వదిలేశాడు. అంతే కాకుండా పలుచోట్ల మ్యాన్‌హోల్స్‌ సీసీ రోడ్డుకన్నా ఎత్తులో, మరికొన్నిచోట్ల రోడ్డుకన్నా తక్కువగా అమర్చడంతో మున్ముందు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఇబ్బందులు కలగకుండా పనులు చేయించాలని కాలనీల వాసులు కోరుతున్నారు.

కోదాడలో అస్తవ్యస్తంగా

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు

ఇష్టారీతిన సీసీ రోడ్లను

తవ్విస్తున్న కాంట్రాక్టర్‌

సక్రమంగా పూడ్చకుండా

వదిలేస్తున్న వైనం

రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

పడుతున్న పట్టణవాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement