అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారా యణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణ పురం నరేష్, అర్చకులు భీంపాండే, అంకిత్పాండే, భక్తులు పాల్గొన్నారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
సూర్యాపేటఅర్బన్ : భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయడంతోపాటు ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)ను నిలిపివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం సూర్యాపేటలోని నల్లాల బావి సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, మద్దెల జ్యోతి, ప్రజాసంఘాల నాయకులు మడ్డి అంజిబాబు, మల్లయ్య, వెంకన్న, పాషా, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.


