ఒకే క్లిక్‌తో ప్రోగ్రెస్ కార్డులు..
‘రాపిడ్ గ్రేడింగ్ సిస్టమ్’ యాప్ రూపొందించిన ఇమాంపేట మోడల్ స్కూల్ టీచర్
సూర్యాపేట టౌన్ : విద్యార్థుల మార్కులు, గ్రేడింగ్, హాజరు, ప్రగతి నివేదికల తయారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు సూర్యాపేట మండలం ఇమాంపేట మోడల్ స్కూల్ పీజీటీ చిట్టిప్రోలు శ్రీనివాస్ ‘రాపిడ్ గ్రేడింగ్ సిస్టమ్ (ఆర్‌జీఎస్)’ మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకులు శ్రీనివాసచారి గురువారం ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల రోజువారీ పనిభారాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థుల విద్యా ప్రగతిని సమర్థవంతంగా విశ్లేషించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా అదనపు సంచాలకులు శ్రీనివాసచారి మాట్లాడుతూ.. విద్యారంగంలో సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా ఉపాధ్యాయుల సమయం ఆదా కావడంతో పాటు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ యాప్‌ను రూపొందించిన పీజీటీ చిట్టిప్రోలు శ్రీనివాస్‌ను.. మోడల్ స్కూల్స్ అదనపు సంచాలకులు శ్రీనివాసచారి, మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, శంకర్‌నాయక్‌లు అభినందించారు.
ఆఫ్‌లైన్‌లోనూ సేవలు..
‘రాపిడ్ గ్రేడింగ్ సిస్టమ్’ యాప్‌లో ఇంటర్నెట్ సదుపాయం లేని సమయంలోనూ డేటాను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే నమోదు చేసిన సమాచారం క్లౌడ్‌లో సురక్షితంగా భద్రపరచబడుతుంది. విద్యార్థుల మార్కులు, హాజరు, ప్రగతి నివేదికలను మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు పంపే అవకాశం ఉంది. అలాగే మార్కులు నమోదు చేయగానే గ్రేడ్లు, ర్యాంకులను ఈ యాప్ ఆటోమేటిక్‌గా లెక్కిస్తుంది.
విద్యార్థుల ప్రగతి పత్రాలను ఒకే క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకుని ముద్రించుకునే (ప్రింట్) సదుపాయం కూడా ఇందులో ఉంది. పదో తరగతి ఇంటర్నల్ మార్కులను క్రోడీకరించడంతో పాటు జంబ్లింగ్ విధానంలో పరీక్షల సీటింగ్ ప్లాన్‌ను వేగంగా సిద్ధం చేసుకునే అవకాశం కల్పించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులతో పాటు ప్రతిభావంతులను కూడా సులభంగా గుర్తించి, వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా ప్రణాళికలు రూపొందించేందుకు ఈ యాప్ దోహదపడనుంది.


