ఇంటిపై సోలార్‌ ప్లాంట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటిపై సోలార్‌ ప్లాంట్‌

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట అర్బన్‌: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ గృహ అవసరాలకు విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో వినియోగదారులపై కరెంట్‌ బిల్లుల భారం పడకుండా, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇళ్లపై సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే నివాస గృహ వినియోగదారులకు ప్రభుత్వం భారీగా రాయితీలు, రూఫ్‌ టాప్‌ ఇన్‌స్టాలేషన్‌ రుణ సదుపాయం కల్పిస్తోంది. సొంతంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, మిగిలిన కరెంట్‌ను విద్యుత్‌ సంస్థ (ఎస్పీడీసీఎల్‌)కు విక్రయించి ఆదాయం పొందే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,300 సోలార్‌ ప్యానెల్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.

మూడు రోజుల పాటు శిబిరాలు

పథకం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ సమీపంలో ఉన్న ఎస్‌ఈ కార్యాలయంలో మూడు రోజుల పాటు ‘సేవా సేతు’ పేరుతో ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సదస్సుకు దాదాపు 500 మందికి పైగా వినియోగదారులు హాజరుకాగా, 60 మంది అక్కడికక్కడే సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు పేర్లు నమోదు చేసుకున్నారు. రెడ్కో, విద్యుత్‌ శాఖ, బ్యాంకింగ్‌ అధికారులు, సోలార్‌ వెండర్లు పాల్గొని సబ్సిడీ, బ్యాంక్‌ రుణాలు, వాయిదాల చెల్లింపులపై అవగాహన కల్పించారు.

వాణిజ్య భవనాల్లోనూ ఆదా..

పీఎం సూర్యఘర్‌ స్ఫూర్తితో జిల్లాలోని పలు హోటళ్లు, ప్రైవేట్‌ పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు కూడా సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. 10 కేవీ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్న హోటళ్లలో నెలకు రూ.12 వేలు వచ్చే కరెంట్‌ బిల్లు ప్రస్తుతం రూ.2 వేల నుంచి రూ.3 వేలకు తగ్గిందని యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌ బంకులపై సోలార్‌ వాడటం ద్వారా నెలకు రూ.15,000 వరకు లాభం పొందుతున్నారు. వాణిజ్య భవనాలకు కూడా రాయితీలు పొడిగించాలని వ్యాపారులు కోరుతున్నారు.

రైతులకు ‘పీఎం కుసుమ్‌’ పథకం

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కుసుమ్‌’ పథకం ద్వారా 3 హెచ్‌పీ నుంచి 10 హెచ్‌పీ వరకు సోలార్‌ పంప్‌సెట్లకు సబ్సిడీ అందిస్తోంది. ఈ ప్యానెళ్లకు 25 ఏళ్ల గ్యారెంటీ ఉండటంతో పాటు పగటిపూట దాదాపు 8 గంటల పాటు ఉచితంగా మోటార్లు నడుస్తాయి. సరైన మార్గదర్శకాలు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సూర్యఘర్‌ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శిబిరాలను ఏర్పాటు చేశాం. ఇళ్లపై సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రధానంగా ఒక కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60వేలు, మూడు కిలో వాట్లకు గరిష్టంగా రూ.78,000 రాయితీ అందిస్తోంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

– యాదగిరి, ఎస్‌ఈ సూర్యాపేట

ఫ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన

పీఎం సూర్యఘర్‌ యోజనతో లబ్ధి

ఫ రూ.78 వేల వరకు సబ్సిడీ

ఫ జిల్లాలో ఇప్పటివరకు

2,300 సోలార్‌ యూనిట్ల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement