ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలకు ఆహ్వానం

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

సూర్యాపేట(సూర్యాపేటటౌన్‌) : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌ ఫ్లాగ్‌ డేను పురస్కరించుకొని జిల్లాలోని ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, షార్ట్‌ ఫిల్మ్‌లు తీసేవారి కోసం ఫోటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ మంగళవారం తెలిపారు. పోలీసుల విధులు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించిన అంశాలపై 2025 అక్టోబర్‌ నుంచి 2026 అక్టోబర్‌ వరకు తీసిన మూడు ఫొటోలు, 3 నిమిషాల నిడివి గల షార్ట్‌ ఫిల్మ్‌ను ఈ నెల 22 లోపు పోటీలకు పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో అందిన ఎంట్రీల నుంచి మూడు షార్ట్‌ ఫిల్మ్‌లు, మూడు ఫొటోలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోపు సూర్యాపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పోలీస్‌ పీఆర్‌ఓకు అందజేయాలని సూచించారు.

ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

సూర్యాపేట(సూర్యాపేటటౌన్‌) : జిల్లాలోని 21 పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో స్పెషల్‌ గెస్ట్‌ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి చావా శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్‌ బీఈడీ పూర్తి చేసి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ వరకు సంబంధిత పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేసి.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారు నవంబర్‌ 2026 నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలలపాటు విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పవిత్రోత్సవాల

ఏర్పాట్ల పరిశీలన

మఠంపల్లి : మట్టపల్లి మహాక్షేత్రంలో ఈనెల 8 నుంచి 11 వరకు శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత భక్త ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌లు ఆలయ అర్చకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో తయారుచేసిన శ్రీచక్రాన్ని వారు పరిశీలించారు. ఆలయంలో నాలుగు రోజుల పాటు రామాయణ, భాగవత పారాయణాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు తదితరులున్నారు.

8న అండర్‌–19

కబడ్డీ జట్ల ఎంపిక

హాలియా : ఉమ్మడి జిల్లా అండర్‌– 19 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికను ఈనెల 8న హాలియాలోని శ్రీ శ్లోక పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు అండర్‌–19 స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ ఇందిర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ వెంట పదవ తరగతి ఒరిజినల్‌ మెమో, రెండు పాస్‌ ఫోటోలు తీసుకురావాలని సూచించారు.

యాదగిరి క్షేత్రంలో

లక్ష పుష్పార్చన పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకొని శ్రీస్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. మంగళవారం సుప్రభాతం, అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజలు జరిపించారు. అనంతరం ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన చేశారు. శ్రీస్వామి అమ్మవార్లకు హారతినిచ్చారు. క్షేత్రపాలకుడికి ఆకుపూజ జరిపించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, సాయంత్రం ఆలయ తిరుమాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement