గరిడేపల్లి : బాల్య వివాహాల నిర్మూలనకు అందరం కట్టుబడి పనిచేద్దామని గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు కీతవారిగూడెంలో నిర్వహించిన గ్రామసభల్లో తీర్మానించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గరిడేపల్లిలో సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య, కీతవారిగూడెంలో సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్ అధ్యక్షతన ఈ గ్రామసభలు జరిగాయి. ఈ సభలకు జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బాలల సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. మిషన్ వాత్సల్య పథకం, అనాథ బాలల సంరక్షణ, బాలల దత్తత విధానం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల రక్షణ చర్యలు, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. బాలలపై ఎక్కడైనా వేధింపులు జరిగినా లేదా బాల్య వివాహం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసినా వెంటనే స్పందించి చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమాల్లో సూపర్వైజర్ ఎన్.రాజ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు జానకి, నాగేశ్వరరావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రతినిధులు సాయి త్రిలోక్, వంశీ, అంగనన్వాడీ టీచర్లు, నారాయణమ్మ, మల్లమ్మ, సైదమ్మ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


