బడి.. పచ్చని ఒడి! | - | Sakshi
Sakshi News home page

బడి.. పచ్చని ఒడి!

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

అన్ని పాఠశాలల్లో నాటేలా చర్యలు తీసుకుంటున్నాం

సూర్యాపేట టౌన్‌ : అమ్మపై ఉన్న ప్రేమకు పచ్చదనాన్ని జోడిస్తూ సూర్యాపేట జిల్లాలో ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ 3.0’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. తల్లి పేరిట ఒక మొక్కను నాటడమే కాకుండా, దాన్ని సొంత కుటుంబ సభ్యుడిగా బాధ్యతాయుతంగా సంరక్షించేలా విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నారు. పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ బాధ్యతను విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 25 వేల మొక్కలు నాటడం విశేషం. విద్యార్థి ప్రాయంలో నాటిన మొక్క పెరిగే కొద్దీ దానితో ఉన్న భావోద్వేగ అనుబంధం కూడా బలపడుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు.

అమ్మ జ్ఞాపకంగా..

తల్లి పేరిట మొక్కను నాటడం ద్వారా చిన్నారుల్లో చిన్నతనం నుంచే ప్రకృతిపై మమకారాన్ని పెంచుతున్నారు. నాటిన మొక్కకు అమ్మ పేరు పెట్టుకోవడం, క్రమం తప్పకుండా నీరు పోయడం వంటి చర్యల్లో విద్యార్థులు భాగస్వాములవుతున్నారు. దీంతో మొక్కలు నాటడం కేవలం ఒక అధికారిక కార్యక్రమంగా కాకుండా, అమ్మ జ్ఞాపకాలను పదిలపరుచుకునే బాధ్యతగా మారుతోంది.

జిల్లావ్యాప్తంగా 25 వేల మొక్కలు

జిల్లాలోని 950 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యాశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ 3.0’కింద ఇప్పటివరకు 25 వేల మొక్కలు నాటారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటిన ప్రతి మొక్కకూ ఒక విద్యార్థిని రక్షకుడిగా నియమించి, ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రం

విద్యార్థులు తమ ఇంటి ప్రాంగణంలో గానీ, పాఠశాల ఆవరణలో గానీ మొక్కలు నాటి ఫొటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫొటోలను ‘ఈకోక్లబ్‌ ఎడ్యుకేషన్‌’ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే, కేంద్ర ప్రభుత్వం తరఫున ‘అమ్మ పేరిట ఒక చెట్టు – 3.0’ డిజిటల్‌ ప్రశంసా పత్రం జారీ అవుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు భూమాతను కాపాడేందుకు కృషి చేసినందుకు గుర్తింపుగా ఈ సర్టిఫికెట్‌ లభిస్తుంది.

ఫ ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌ 3.0’కు

జిల్లాలో విశేష స్పందన

ఫ తల్లి పేరిట ఇప్పటివరకు

25 వేల మొక్కలు నాటిన

విద్యార్థులు, ఉపాధ్యాయులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అమ్మ పేరిట మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు దాదాపు 25 వేల మొక్కలు నాటాం. ఈ నెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి.

–అశోక్‌, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement