సూర్యాపేట : సమాజానికి, కుటుంబానికి మార్గదర్శకులైన వయోవృద్ధులను గౌరవించి, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు వారం రోజులపాటు నిర్వహించే వయోవృద్ధుల వారోత్సవాల వాల్పోస్టర్ను గురువారం కలెక్టరేట్లోని వీసీ ఛాంబర్లో కలెక్టర్ ఆవిష్కరించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వృద్ధుల రక్షణ, ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్’ చట్టంపై వివరించారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా నిర్లక్ష్యం చేసే పిల్లల స్థూల వేతనం నుంచి నేరుగా 15 శాతం లేదా గరిష్టంగా రూ.10 వేల వరకు కట్ చేసి, తల్లిదండ్రుల ఖాతాకు జమ చేసేలా నిబంధనలు ఉన్నాయని స్పష్టం చేశారు. సీనియర్ సిటిజన్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ఫ్రీ నంబర్ 14567 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె.నరసింహారావు, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు సీతారామయ్య, జి.విద్యాసాగర్, ఎస్డీ హమీద్ ఖాన్, ఇరిగె కోటేశ్వరి, గజ్జల కృష్ణారెడ్డి, వినోద్కుమార్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల పాటు కార్యక్రమాలు
ఫ ఈ నెల 24వ తేదీన వృద్ధుల శ్రేయస్సు, సాధికారత వారోత్సవాల ప్రారంభం
ఫ 25న వృద్ధుల ఆరోగ్య, సంరక్షణ దినోత్సవం–వృద్ధాశ్రమాల్లో ఇండోర్ ఆటలు
ఫ 26న వృద్ధాశ్రమాల సామర్థ్య పెంపు–సిబ్బందికి కనీస ప్రమాణాలు, సంరక్షణపై శిక్షణ, తనిఖీలు
ఫ 28న సైబర్ భద్రత, డిజిటల్ అక్షరాస్యత–వృద్ధులపై వేధింపులు, మోసాలపై అవగాహన
ఫ 29న పాఠశాలల్లో విద్యార్థులు, వారి తాతయ్యలు–బామ్మలతో ఆత్మీయ కలయికలు
ఫ 30న యాక్టివ్ ఏజింగ్, వెల్నెస్, ఇంటర్–జనరేషనల్ వాకథాన్
ఫ అక్టోబర్ 1వ తేదీ ముగింపు వేడుకలు.
ఫ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే
జీతంలో 15 శాతం కోత
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


