హుజూర్‌నగర్ : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంట లకు చింతల పాలెం మండలం దొండపాడు, బుగ్గమాదారంలో లిఫ్ట్ పనులను మంత్రి పరిశీలిస్తారు. అనంతరం రూ.10 కోట్లతో చేపట్టే మేళ్లచెరువు –చింతిర్యాల రోడ్డు పనులు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మఠంపల్లి మండలంలో రూ 2.20 కోట్లతో చేపట్టనున్న కామంచికుంటతండా నుంచి చింతలపాలెం రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బక్కమంతులగూడెం నుంచి అల్లీపురం వరకు రూ.42 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులను మంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.
కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
ఫ డీఐఈఓ సులోచనారాణి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధ్యాపకులు కృషి చేయాలని డీఐఈఓ సులోచనా రాణి అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. కళాశాల నూతన భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అధ్యాపకులు ఉత్తమ విద్యను అందిస్తున్నారని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట కళాశాల ప్రిన్సిపాల్ మారం హరిప్రసాద్, అధ్యాపకులు ఉన్నారు.
నిరుపేదలను గుర్తించాలి
నూతనకల్ : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అర్హులైన నిరుపేదలను గుర్తించాలని గృహనిర్మాణశాఖ డిప్యూటీ డీఈ జబ్బార్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మార్గదర్శకాలపై శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో గుడిసెలు, టార్పాలిన్ కవర్లతో ఏర్పాటు చేసుకున్న నివాసాల్లో ఉంటున్న వారిని గుర్తించి అధికారులకు అందజేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగస్వాములవ్వాలని సూచించారు. ఎంపీడీఓ సునీత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
రేపు రౌండ్ టేబుల్ సమావేశం
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం రూపొందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న సూర్యాపేట జడ్పీ హైస్కూల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ హాజరు కానున్నారని, విద్యార్థుల తల్లిదండ్రలు, విద్యావేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


