సూర్యాపేటటౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్ కొత్త ఆరోగ్య పథకం కోసం మే నెల వేతనం నుంచే కోతలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య అన్నారు. ఆదివారం సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లకు కొత్త ఆరోగ్య పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి సంబంధించిన సర్వీసు బుక్‌లు, కుటుంబ సభ్యుల వివరాలు ఆన్‌లైన్ చేయడం ఇంకా పూర్తి కాలేదన్నారు. కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉండబోతుంది.? ఏయే ఆస్పత్రుల్లో సేవలు అందుతాయనే విషయాలు ప్రభుత్వం అధికారికంగా ఇంకా వెల్ల డించలేదన్నారు. ఇవన్నీ పూర్తికాక ముందే హెల్త్‌కార్డ్‌కు సంబంధించిన డబ్బులను వేతనాల నుంచి కోత విధించడంలో ప్రభుత్వానికి అంత దొందరెందుకని ప్రశ్నించారు. సమావేశంలో డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బి.దేవేందర్, గణిత, రాంసింగ్, కోటయ్య, సాహెబ్‌అలీ, ఫజల్ ఆబ్‌ఖాన్ పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఖండన
రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూషన్‌తో కూడిన హెల్త్ కార్డులను అందించే క్రమంలో ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే ఆర్థిక శాఖ మే నెల నుంచే ఉద్యోగుల వేతనాలలో 1.5శాతం మినహాయించడాన్ని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, అనిల్ కుమార్‌లు ఖండించారు. ఆదివారం జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. నెట్వర్క్ ఆస్పత్రులతో చర్చలు జరపలేదని, రాష్ట్రంతో పాటు విజయవాడ, కర్నూలు పట్టణాల్లోనూ వైద్యం అందించాలన్న డిమాండ్‌ను పరిశీలించలేదన్నారు.
డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య


