భానుపురి (సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటరీకరణ విధానాలు అవలంభిస్తూ ఆర్టీసీ ఆస్తులను ఏకపక్షంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నాయని, కార్మికులు చెమటోడ్చి సంపాదించుకున్న ఆర్టీసీ ఆస్తుల జోలికొస్తే ఊరుకునేది లేదని టీఎస్ ఆర్‌టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ హెచ్చరించారు. మంగళవారం సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ భవన్ ఏ బ్లాక్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆస్తులపై చేసిన నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీలకు కేటాయించాని కోరారు. కార్యక్రమంలో సంఘం డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


