హుజూర్‌నగర్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద ఉన్న ఏటీసీ సెంటర్‌ను సందర్శించారు. సెంటర్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా రూ. 46 కోట్లతో ఏటీసీ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రస్తుతం 172 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి రూ.2 వేల చొప్పున స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రూ. 14 కోట్లతో ఐటీఐ భవనం నిర్మాణంలో ఉందన్నారు.
రాష్ట్రానికే తలమానికంగా మోడల్ కాలనీ
హుజూర్‌నగర్ మోడల్ కాలనీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. రామస్వామి గుట్ట వద్ద 116 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మోడల్ కాలనీని మంగళవారం ఆయన పరిశీలించారు. ఇళ్లను పరిశీలించి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక ఉంటుందన్నారు. మోడల్ కాలనీలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోడల్ కాలనీ పనులను ఉద్దేశ్య పూర్వకంగానే అటకెక్కించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేశామన్నారు. ఈ నెలాఖరుకు మోడల్ కాలనీ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ప్రిన్సిపాల్ శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, ఏఎంసీ చైర్‌పర్సన్ డి.రాధిక, ఆర్‌డీఓ శ్రీనివాసులు, విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్య, తహసీల్దార్ కవిత, నాయకులు ఉన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


