ఉదయం ఎండ.. సాయంత్రం మేఘావృతం
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుతం వరి పొలాలు కోత దశలో ఉన్నాయి. చాలా మంది రైతులు కోతలు కూడా ప్రారంభించారు. ఈ సమయంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస్తే తాము ఇన్ని రోజులు పడ్డ శ్రమ వృథా అవుతుందని భయాందోళన చెందుతున్నారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతులను మరింత కలవర పెడుతోంది.
4.82 లక్షల ఎకరాల్లో వరి
సూర్యాపేట జిల్లాలో యాసంగి సీజన్‌లో 4.82 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. బోరు బావులు కింద మొదటగా సాగు చేసిన వరి పొలాలు ప్రస్తుతం కోత దశలో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది రైతులు నూర్పిడి చేసి ధాన్యాన్ని మిల్లులు, మార్కెట్‌కు తరలిస్తున్నారు. మరి కొందరు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లారు. ఈ వారం రోజుల్లో 90 నుంచి 1.20 లక్షల ఎకరాల్లో పొలాలు నూర్పిడి కానున్నాయి. మిగతా పొలాలు మరో 15 రోజులకు కోతకు వచ్చిఏ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలు కురిస్తే కోత దశలో ఉన్న పొలాలు ఆగమయ్యే ప్రమాదం ఉంది. ఈదురు గాలులు వీస్తే వరి పైరు పూర్తిగా నేల వాలిపోవడం, గింజలు రాలిపోవడం జరిగి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుంది.
జిల్లాలో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం సూర్యుడు తమ ప్రతాపాన్ని చూపుతున్నా సాయంత్రం వేళల్లో ఆకాశం మేఘావృతం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. దాంతో రైతులు తమ పొలాలను త్వరగా కోసుకునేందుకు ఆరాట పడుతున్నారు. అందరూ ఒకే సారి వరికోత యంత్రాల కోసం ఎగబడుతుండడంతో వారు రేట్లు పెంచుతున్నారని రైతులు చెబుతున్నారు. అయినా అవి దొరక్క ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి కోతలు కోసిన రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యంపై పట్టాలు కప్పి భద్ర పరుస్తున్నారు.
ఫ కోతకు సిద్ధంగా వరి పొలాలు
ఫ ఈదురు గాలులు వస్తే తీవ్ర నష్టం
ఫ వాతావరణంలో మార్పులతో
రైతుల్లో ఆందోళన


