రూ.99 లక్షల జీఎస్టీ ఎగనామం! | - | Sakshi
Sakshi News home page

రూ.99 లక్షల జీఎస్టీ ఎగనామం!

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఓ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీకి ఎగనామం పెట్టింది. ఈ ఏజెన్సీ యూనివర్సిటీకి జూనియర్‌ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్స్‌, డైనింగ్‌ హాల్స్‌ హెల్పర్లు, స్టోర్‌ కీపర్లు వంటి 113 మందిని కేటాయించగా వారు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందిని కేటా యించినందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నేళ్లుగా సదరు ఏజెన్సీ రూ.99 లక్షలు జీస్టీ ఎగ్గొట్టినా యూనివర్సిటీ అధికారుల్లో చలనం లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. అన్నీ తెలిసిన సందరు అధికారులు ఈ విషయాన్ని దాచి పెట్టడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఎస్టీ చెల్లించాలని పలుమార్లు జీఎస్టీ అధికారులు యూనివర్సిటీతోపాటు ఏజెన్సీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులు ఒత్తిడి తెస్తుండడంతో యూనివర్సిటీ అధికారులు రెండు నెలలుగా ఏజెన్సీకి ఇవ్వాల్సిన నిధులు నిలిపివేశారు. దాంతో వర్కర్లు, ఉద్యోగులకు వేతనాలందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

అధికారుల బాధ్యతారాహిత్యం..

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో వర్కర్ల కోసం టెండర్లు పిలిచిన సమయంలోనే ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ సంస్థ జీఎస్టీ సంస్థ నుంచి బకాయిలు లేనట్లు ఎన్‌ఓసీ సమర్పించాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీ అధికారులు ఈ నిబంధనలు పట్టించుకోకుండా సదరు ఏజెన్సీ సంస్థకు టెండరు అప్పగించారు. మూడు నాలుగేళ్లుగా జీస్టీ చెల్లించడం లేదని జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోక పోవడంతోనే సదరు ఏజన్సీ ఏకంగా రూ.99 లక్షల జీఎస్టీ ఎగ్గొట్టింది. ఒక్కో ఉద్యోగికి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉండగా, యూనివర్సిటీ నేరుగా 2 శాతం, ఏజెన్సీ ద్వారా 16 శాతం చెల్లించాల్సి ఉంది. ఈ 16 శాతం డబ్బులను ఏజెన్సీ సంస్థ స్వాహా చేసినా అధికారులు పట్టించుకోలేదు. కొందరు వర్సిటీ అధికారులు ఏజెన్సీతో అంటకాగి ముడుపులు పుచ్చుకొని ఇందుకు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. జీఎస్టీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో ఏ అధికారికి నోటీసులు వెళ్లినా కూడా ఏజెన్సీ సంస్థకు జీతాలు, జీఎస్టీ చెల్లింపు అతడిదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా, రిటైర్డ్‌ అయినా కూడా వారిపైన క్రిమినల్‌ కేసులు పెట్టాలనే నిబంధనలు కూడా ఉన్నాయి.

ఎంజీయూలో ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వాకం

దాచిపెడుతున్న యూనివర్సిటీ అధికారులు

రెండు నెలలుగా ఔట్‌సోర్సింగ్‌ వర్కర్లకు వేతనాలు ఇవ్వని ఏజెన్సీ

జీఎస్టీ చెల్లింపు బాధ్యత ఏజెన్సీదే..

ఉద్యోగులను, వర్కర్లను సరఫరా చేస్తున్న ఏజెన్సీకి ప్రతినెలా 16 శాతం జీఎస్టీ చెల్లించాం. జీఎస్టీ చెల్లించలేదని జీఎస్టీ కార్యాలయం నుంచి నోటీస్‌ వచ్చింది వాస్తవమే. ఏజెన్సీ యజమానికి కూడా నోటీస్‌ ఇచ్చాం. జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత ఏజెన్సీదే.

– అంజిరెడ్డి, ఎంజీయూ రిజిస్ట్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement