వివాదాలు లేకుండా చూస్తున్నాం
మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో నిధుల పంచాయితీ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు విడతల్లో విడుదల చేసింది. వచ్చిన నిధులు తమవేనంటూ ఇటు మాజీ సర్పంచ్‌లు, అటు గ్రామ పంచాయతీ కార్యదర్శులు పట్టుబడుతున్నారు. అక్కడక్కడా మాజీ సర్పంచ్‌లకు తెలియకుండానే గ్రామ కార్యదర్శులు డ్రా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. దీంతో నిధుల పంచాయితీ రచ్చకెక్కింది. సందట్లో సడేమియాగా కొందరు అధికారులు రానున్న వేసవిలో మంచినీటి ఎద్దడి నివారణకు ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉందని, ఈ నిధులు ఎవరికీ ఇవ్వొద్దని ఆదేశించడమేంటని మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు.
ఎంబీలు కాక.. నిధులు ఆలస్యం
జిల్లావ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీలకు 2019లో జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన వారంతా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ప్రధానంగా క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, వీధిలైట్లు, సీసీ రోడ్లు నిర్మాణం, రైతు వేదికలు, బతుకమ్మ ఘాట్లు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా పలు రకాల పనులు చేశారు. ఈ సర్పంచ్‌ల పదవీకాలం దగ్గర పడిన సమయంలో చేసిన పనులకు ఎంబీలు వెంటనే కాకపోవడం, ఇతర కారణాలతో ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ఆలస్యమైంది. సర్పంచ్‌ల పదవీకాలం ముగియడం, తిరిగి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారుల పాలనతో నెట్టుకొచ్చింది. దీంతో పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయలేదు. సర్పంచ్‌లు పదవీకాలం ముగిసే సమయానికి దాదాపు జిల్లాలో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
నిధుల విడుదలతో కొత్త పంచాయితీ!
జిల్లాలోని 486 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగి సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి ఇప్పటి వరకు జిల్లాకు రెండు విడతల్లో నిధులు విడుదల చేసింది. మొదటి విడత 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.11.45 కోట్లు, రెండో విడతలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.10 కోట్లు విడుదల చేసింది. ఇందులో 2023–24 నిధులు మాజీ సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించిన నిధులు రాగా.. 2024–25 నిధులు కార్యదర్శులకు రావాల్సి ఉంది. అయితే కొందరు నిధుల విషయంలో స్పష్టత లేకుండా కార్యదర్శులు, ప్రస్తుత సర్పంచ్‌లు కొన్నిచోట్ల డ్రాలు చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు మాజీ సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన విషయాలను సరిచేస్తుండగా.. కొందరు ఇంకా అలాగే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిధుల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి తమకు నిధుల వచ్చేలా చూడాలని మాజీ సర్పంచ్‌లు కోరుకుంటున్నారు.
జిల్లాకు విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు..
విడత నిధులు ఏ సంవత్సరానివి
(రూ.కోట్లలో..)
మొదటి 11.45 2023 – 24
రెండవ 10 2024 – 25
ఇటీవలే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
ఈ నిధులు తమయేనంటున్న
మాజీ సర్పంచ్‌లు, కార్యదర్శులు
అక్కడక్కడా డ్రా చేస్తున్న కార్యదర్శులు
అధికారులకు సమస్యగా
మారిన నిధుల కేటాయింపు
సర్పంచ్‌లు లేకపోవడంతో..
పంచాయతీలకు సర్పంచ్‌లు లేకపోవడంతో కార్యదర్శులే దాదాపు రెండేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిధులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రధానంగా వేసవిలో మంచినీటి ఎద్దడికి, ట్రాక్టర్ల డీజిల్, పారిశుద్ధ్యం, వీధిలైట్ల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టారు. ఒక్కో గ్రామ కార్యదర్శి రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఒకట్రెండు చోట్ల నిధుల పంచాయితీలు వచ్చాయి. ఈ విషయంలో స్పష్టత ఇచ్చి వివాదాలు లేకుండా చూస్తున్నాం. త్వరలోనే మరికొన్ని నిధులు రావాల్సి ఉంది. ఎవరికి రావాల్సిన బిల్లులు వారికే వస్తాయి.
– యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి
మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లు చెల్లించాలని సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లింపులపై వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ముందు సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.247 కోట్ల నిధులను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా మాజీ సర్పంచ్‌లను మోసం చేసేలా ప్రకటనలు చేస్తోందన్నారు. మాజీ సర్పంచ్‌లు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామన్నారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కేశబోయిన మల్ల య్య, నూతనకల్ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చూడి లింగారెడ్డి, తుంగతుర్తి మండల ఫోరం ఉపాధ్యక్షులు లాకావత్ యాకు నాయక్, రామన్నగూడెం మాజీ సర్పంచ్ గంధం మల్లారెడ్డి, వెలుగుపల్లి మాజీ సర్పంచ్ మామిడి వెంకన్న, గోవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు శ్రీను, వీరన్న, పుణ్యనాయక్, శంకర్, పాముల ఉపేందర్, రమేష్, శ్రీను, నవీన్ రెడ్డి, నర్సింహ, జగపతి తదితరులు పాల్గొన్నారు.


