చివ్వెంల (సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా న్యాయవాదులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, మహిళా న్యాయవాదులు గాయత్రి, నెండెం వాణి, కాసం సరిత, శశిరేఖ, జుష్మిత, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదాలతో
అప్రమత్తంగా ఉండాలి
పెన్‌పహాడ్ : అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రమాదాలు సంభవించినప్పుడు అప్రమత్తంగా ఉండేలా జాగ్రత్తలు చెప్పాలని జిల్లా అగ్నిమాపక అధికారి జానయ్య అన్నారు. సోమవారం పెన్‌పహాడ్ మండలం అనాజీపురంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థుల భద్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాలు, భద్రతా చర్యలపై పాఠశాల ప్రిన్సిపాల్ కోడి లింగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అగ్ని మాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వరలక్ష్మి ఆశయాలు సాధిద్దాం
మునగాల : మండల కేంద్రానికి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం మునగాలలోలోని రఘునాథం మిల్లు ఆవరణలో ప్రముఖ విద్యావేత్త అర్వపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన వరలక్ష్మి సంతాప సభలో ఆయన మాట్లాడారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులు.. విద్యార్థులకు పాఠశాల డ్రెస్, పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సభలో సీపీఐ, సీపీఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు నంద్యాల రామిరెడ్డి, మామిడి వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, బద్ధం భద్రారెడ్డి, పైడిమర్రి వెంకటనారాయణ, సీహెచ్ .సీతారామ్, మామిడి చినరామయ్య, ములకలపల్లి రాములు, బుర్రి శ్రీరాములు, సుంకర అజయ్‌కుమార్, ఉప్పుల యుగంధర్‌రెడ్డి, కందిబండ సత్యనారాయణ పాల్గొన్నారు.
నారసింహుడికి నిత్యారాధనలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం జరిపారు. అనంతరం విష్వక్సేనారా ధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రంలోగల శివాలయంలోని శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి మహా న్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపా రు. ఆంజనేయస్వామికి, గోదాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఈఓ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


