పట్టణాల్లో జీ ప్లస్ వన్ ఇళ్లు
సూర్యాపేట అర్బన్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మున్సిపాలిటీల్లోని పేదలకు ఊరట లభించింది. ఇందిరమ్మ ఇంటిని కనీసం 600 చదరపు అడుగుల స్థలంలో నిర్మించుకోవాలనే నిబంధన ఉండగా గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోని లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు సరిపోయేంత స్థలం లేక ఆసక్తిచూపడం లేదు. దీంతో పట్టణ ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు కూడా జీ ప్లస్ వన్ విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని నిబంధన సడలించింది. ఈ మేరకు ఇటీవల జీఓ కూడా జారీ చేసింది.
భానుపురిలో 228 ఇళ్లకు మార్కింగ్
ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ వన్‌గా నిర్మించుకునే అవకాశం కల్పించడంతో జిల్లాలోని ఒక్క సూర్యాపేట మున్సిపాలిటీలోనే మొత్తం 48 వార్డుల్లో మొదటి విడతగా 318 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 228 ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ చేశారు. వీటిలో దాదాపు 35 ఇళ్లు బేస్మెంట్ లెవల్‌కు చేరిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ.లక్ష నగదు జమయ్యాయి. రూఫ్ లెవెల్ వచ్చిన ఇళ్లకు రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.1.40లక్షలు, లెట్రిన్‌తో సహా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1.60లక్షలను ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక స్తోమత లేనివారికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులు జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించుకునేలా వార్డు అధికారులు అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లోని ఇదే విధానం అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధన సడలింపు
ఫ ఇటీవల జీఓ జారీ చేసిన ప్రభుత్వం
ఫ 400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నా ఓకే
ఫ తొలి విడతలో సూర్యాపేటకు
318 ఇళ్లు మంజూరు
ఫ సరిపడా స్థలంలేని వారు
కొత్త విధానంలో ఇందిరమ్మ ఇళ్లు
నిర్మించుకోవాలంటున్న అధికారులు


