15న ప్రత్యేక లోక్ అదాలత్
సూర్యాపేట : సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి కోర్టుల్లో ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన జడ్జి పి.లక్ష్మీ శారద శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. అవకాశాన్ని కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
ఓటరు జాబితా
సవరణపై సమీక్ష
సూర్యాపేట : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఇతర అధికారులు హాజరయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు తదితరులుణు పాల్గొన్నారు.
రోడ్లకు మరమ్మతులు
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుంతలు పడి అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు శనివారం మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. రోడ్డుపై వెళ్తే ఒళ్లు హూనం అనే శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. తక్షణ మరమ్మతుల కింద పట్టణంలోని వివిధ చోట్ల రోడ్లపై ఏర్పడిన గుంతల్లో కంకర పొడి పోసి మరమ్మతులు చేయించారు.
5న ఆర్చరీ పోటీలు
నల్లగొండ టూటౌన్ : ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, తునికి విజయసాగర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి జన్మదిన, బోనఫైడ్ సర్టిఫికెట్లతో న్యూ డైమెన్షన్ పాఠశాల వద్దకు 5వ తేదీన ఉదయం 9 గంటలకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 99120 55678 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
3 నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల నిరవధిక సమ్మె
సూర్యాపేట : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ, అన్ని ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ నెల 3 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీకుళ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సీహెచ్.సత్యంగౌడ్ తెలిపారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో ఎంజీయూ రిజిస్ట్రార్‌కు సమ్మె నోటీసును అందజేసి మాట్లాడారు. సమ్మెకు అన్నివర్గాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
15న ప్రత్యేక లోక్ అదాలత్


