
భువనగిరిలో నకిలీ నోట్ల కలకలం
భువనగిరి: భువనగిరి పట్టణంలో సోమవారం నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్‌లో మొబైల్ షాపు నిర్వహిస్తున్న పల్లెర్ల నాగేంద్రబాబు వద్దకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. తన దగ్గర రూ.11వేల నగదు ఉందని, తన బంధువులకు ఫోన్ పే చేయాలని వేడుకున్నాడు. దీంతో నాగేంద్రబాబు తన ఫోన్ ద్వారా సదరు వ్యక్తి చెప్పిన నంబర్‌కు రూ.11వేలు ఫోన్ పే చేయగా.. అతడు రూ.11వేల నగదును నాగేంద్రబాబుకు ఇచ్చాడు. అనంతరం నాగేంద్రబాబు నోట్లను పరిశీలించగా.. అవి దొంగ నోట్లని అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.