
మదర్ డెయిరీకి రూ.50 కోట్లు కేటాయించాలి
సాక్షి,యాదాద్రి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుల కుప్పగా మారిన మదర్ డెయిరీని ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించాలని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి కోరారు. సోమవారం భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఏడాది కాలంలో మదర్ డెయిరీ అప్పుల పాలైనట్లు బీఆర్‌ఎస్ నాయకుడు గొంగిడి మహేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే మదర్ డెయిరీని దివాలా దిశకు చేర్చారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన చైర్మన్లు వేలాది మంది రైతులు, డెయిరీలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన విచారణలో పదేళ్లలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. మదర్ డెయిరీని ఎన్‌డీడీబీ టేకోవర్ చేయడానికి సిద్ధంగా ఉందని.. ఒకవేళ అలా జరగకపోతే అప్పుల కింద బ్యాంకు వాళ్లే లాకౌట్ చేస్తారన్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లో ఉన్నట్లు తప్పుడు ఆడిట్ రిపోర్టులు తయారు చేసి, బ్యాంకును నమ్మించడానికి అప్పులకు కూడా ఇన్‌కం టాక్స్ కట్టిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. డైరక్టర్ల ఎన్నికల్లో పొత్తు ధర్మం తప్పింది గొంగిడి మహేందర్‌రెడ్డే అన్నారు. తన పార్టీకి చెందిన వ్యక్తిని అదనంగా పోటీలో నిలబెట్టి డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అదనంగా రంగంలో దిగితే షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. డబ్బులు ఇచ్చి, పాల చైర్మన్లకు ఫోన్లు చేసిన గొంగిడి మహేందర్‌రెడ్డి నైతికవిలువలు మర్చిపోయాడన్నారు. గత బీఆర్‌ఎస్ పాలకవర్గాల బాధ్యతారాహిత్యమే నేటి దుస్థితికి కారణమని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, పుప్పాల నర్సింహులు, కర్నాటి జయశ్రీ ఉప్పల్ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వానికి చైర్మన్
గుడిపాటి మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి