
కొత్త పనులకు బ్రేక్..!
అదనంగా మంజూరైన ఇళ్ల పరిస్థితి..
భానుపురి (సూర్యాపేట) : స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో జిల్లాలో కొత్త పనులకు బ్రేక్ పడనుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ప్రభుత్వపరంగా ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడానికి వీలు లేకుండా పోనుంది. ఇప్పటికే అమలులో ఉన్న పాత పథకాలు, పనులు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. జిల్లా యంత్రాంగమంతా దాదాపు ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్లింది. స్థానిక సంస్థల సమరం ముగిసే వరకు ఎన్నికల సంఘం ఆదేశాలనే పాటించాల్సి ఉంది.ఈ మేరకు మంగళవారం రాజకీయ పార్టీలతో ఎన్నికల కోడ్‌పై మండల స్థాయిలో జిల్లావ్యాప్తంగా సమావేశాలను నిర్వహించారు. అలాగే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుపై ఎన్నికల సంఘం సూచనల మేరకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
అనుమతి తప్పని సరి
జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఏ సమావేశం, ర్యాలీకై నా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో.. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం వర్తించనున్నాయి. అభ్యర్థుల ఖర్చులపై నిఘా సైతం ఉండనుంది. ప్రకటనలు, గోడలపై రాతలు రాయించే సమయంలోనూ ఎన్నికల సంఘం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
బోనస్ అందేనా!
గత యాసంగి సీజన్‌లో జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. దాదాపు 50,992 మంది రైతులకు రూ.25.17 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌తో ఈ బోనస్ చెల్లింపులకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నాలుగు నెలలుగా రైతులు బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. ఎన్నికల నిబంధనలు అడ్డంకిగా మారితే మరో 45రోజుల పాటు వేచిచూడాల్సిందే.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి కొత్త పనులు చేపట్టేందుకు వీలుండదు. 486 గ్రామపంచాయతీల పరిధిలో సీసీరోడ్ల నిర్మాణం నుంచి నూతన భవనాల వరకు ఏ ఒక్క కొత్త నిర్మాణం ఈ ఎన్నికల కోడ్ కారణంగా చేపట్టకూడదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను పెద్ద ఎత్తున మంజూరు చేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపనలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అయితే నూతనంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తెలుస్తోంది. ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారుల పరిస్థితిపై స్పష్టత లేదు. జిల్లాకు నియోజకవర్గానికి 3500ల చొప్పున ఇళ్లు మంజూరు కాగా.. అదనంగా ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతలోనే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఇళ్ల మంజూరు, లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోనుంది.
ఫ అమలులోకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
ఫ రాజకీయ పార్టీల సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
ఫ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బంద్
ఫ ఎన్నికల సంఘం పరిధిలోకి జిల్లా యంత్రాంగం