
హత్య కేసులో పది మంది అరెస్ట్
సూర్యాపేటటౌన్ : పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన పది మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్‌కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్ది లింగస్వామికి, చారగండ్ల శివకుమార్‌కు ఐదేళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్‌పై హత్యాయత్నం చేసిన పెద్ది లింగస్వామిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్‌పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగండ్ల శివకుమార్, పెద్ది లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో పెద్ది లింగస్వామి తన స్నేహితులు మాతంగి మధు, మరికొంత మందితో కలిసి శివకుమార్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. ఈ మేరకు అదే రోజు సాయంత్రం శివకుమార్‌కు మాతంగి మధుతో ఫోన్ చేయించి కుసుమవారిగూడెం వైన్ షాప్ వద్దకు పిలిపించాడు. శివకుమార్ వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10గంటల సమయంలో మందు తాగుతుండగా.. పెద్ది లింగస్వామి, అతడి స్నేహితుడు మాతంగి మధు, మరికొందరు కలిసి మారణాయుధాలతో శివకుమార్‌ను హత్య చేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పది మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. కాగా హత్యకు గురైన శివకుమార్‌తో పాటు నిందితులపై గతంలో రౌడీషీట్ ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక స్కూటర్, మూడు మోటార్ సైకిళ్లు, మూడు కత్తులు, రెండు గొడ్డళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
మొత్తం 12 మందిపై కేసు నమోదు..
ఈ హత్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడైన సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రీ మధు, పెద్ది లింగస్వామి, సీతారాంపురానికి చెందిన చెవుల నరేష్, జేజేనగర్‌కు చెందిన జక్కి సతీష్, కేసారం గ్రామానికి చెందిన భాషపంగుల సతీష్, సూర రామచంద్రు, తాళ్లగడ్డకు చెందిన నేరెళ్ల శ్రీరాములు, అన్నాదురైనగర్‌కు చెందిన గువ్వల తరుణ్‌కుమార్, కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేష్, ఇందిరమ్మ కాలనీకి చెందిన జెల్లా ఉదయ్‌కుమార్ అరెస్టయ్యారు. జేజేనగర్‌కు చెందిన జక్కి అనిల్, కృష్ణటాకీస్ దగ్గర గల వర్రె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
రిమాండ్‌కు తరలింపు
పరారీలో మరో ఇద్దరు