
బడి బస్సు భద్రమేనా..!
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడంలేదు. నూతన విద్యా సంవత్సరం పునః ప్రారంభానికి గడువు సమీపిస్తున్నా బస్సుల సామర్థ్య పరీక్షలు చేయించడంలో నిర్లక్ష్యంవహిస్తున్నాయి. మే 15వ తేదీతోనే ఫిట్‌నెస్ గడువు ముగిసినా పట్టించు కోవడం లేదు.
500కు పైగా ప్రైవేట్ పాఠశాలల బస్సులు..
జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు చేరవేసేందుకు 500కు పైగా బస్సులు వినియోగిస్తున్నాయి. ఫిట్‌నెట్ ఉంటేనే ఆ బస్సు రోడ్డు ఎక్కాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా మే 15 నుంచి జూన్ 12 వరకు రవాణా శాఖ అధికారుల వద్ద ప్రైవేట్ యాజమాన్యాలు వాహనసామర్థ్య పరీక్షలు చేయించాల్సి ఉంది. ప్రస్తుతం కొన్ని బస్సులకు మాత్రమే ఫిటనెస్ పరీక్షలు చేయించుకున్నారు. ఫిట్‌నెస్ చేయించుకోని బస్సులు జూన్ 12వ తేదీ నుంచి రోడ్ల పైకి వస్తే బస్సులను సీజ్ చేస్తామని రవాణాశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఫిటెసెస్ పరీక్షలు చేయించని బస్సులు రోడ్లపైకి వస్తే అనుకోని ప్రమాదాలు సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాగా వేసవి సెలవు ల్లో పాఠశాలల, కళాశాలలు మూసి ఉన్నందున యజమాన్యాలు వారికున్న బస్సులను కిరాయిలకు పంపడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగిం చుకున్నందున బస్సులకు ఫిటెనెస్ తప్పనిసరిగా చేయించిన తర్వాతే రోడ్లపైకి అనుమతించాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు దృష్టిసారిస్తే మంచిది..
తమ పిల్లలను పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు నెలకోసారి బస్సుల్లో ప్రయాణించి కండీషన్, పరిమితికి మించి విద్యార్థులను తర లిస్తున్నారా లేదా అనే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. పరిశీలించిన వివరాలను అధికారులకు తెలియజేయాలి. బస్సులో సమర్థవంతమైన డ్రైవర్, క్లీనర్, అటెండర్లు ఉన్నారా.. లేదా పరీక్షించుకోవాలి. ఫిట్‌నెస్ పత్రాలు లేకుంటే ఫిర్యాదు చేయాలి. ఇంటి నుంచి బస్టాప్ వరకు పిల్లలతో వచ్చి బస్సు ఎక్కించాకే తిరిగి వెళ్లాలి. బస్సులు, ఆటోలు ఇతర వాహనాల్లో పంపినప్పుడు ఎక్కువ మందిని కూర్చోబెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్న విషయాన్ని మరువకూడదు.
ఫిట్‌నెస్ లేకుంటే సీజ్ చేస్తాం
ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే యాయమాన్యాలకు తెలియజేశాం. ఫిట్‌నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను తరలించే బస్సులను సీజ్ చేస్తాం. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఇతర వాహనాలనూ సీజ్ చేయడమే కాకుండా లైసెన్స్లును రద్దు చేస్తాం. జూన్ 12 వ తేదీ లోపు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలి.
– సురేష్‌రెడ్డి,
జిల్లా రవాణాశాఖ అధికారి
ఫ వాహనసామర్థ్య పరీక్షలపై
దృష్టిసారించని ప్రైవేట్ స్కూళ్ల
యాజమాన్యాలు
ఫ జిల్లావ్యాప్తంగా 500కు పైగా ప్రైవేట్ పాఠశాలల బస్సులు
ఫ జూన్ 12 నుంచి బడులు పునఃప్రారంభం
ప్రైవేట్ స్కూళ్లు 350
విద్యార్థుల సంఖ్య 40,500
బస్సులు 500
నిబంధనలు ఇవీ..
స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఎల్లో కలర్ వేయించడంతో పాటు నాలుగువైపులా పాఠశాల పేరు రాయించాలి.
డ్రైవర్‌కు నాలుగేళ్ల సీనియారిటీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవర్ వివరాలను జిల్లా రవాణాశాఖ అధికారులకు తెలియజేయాలి. డ్రైవర్ కచ్చితంగా యూనిఫాం ధరించాలి.
బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దు.
మూడు నెలలకోసారి డ్రైవర్‌కు మధుమేహం, రక్తపోటు తదితర ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
విండ్ స్క్రీన్, వైపర్, లైటింగ్స్, మెకానికల్ కండీషన్ పని తీరును రిజిస్టర్‌లో రాయాలి.
బడి బస్సుల పార్కింగ్ కోసం విద్యాలయాల ప్రాంగణాల్లో ప్రత్యేక స్థలం కేటాయించాలి.
పిల్లల సంరక్షణ బాధ్యత చూసేందుకు బస్సుకు ఒక అటెండర్‌ను నియమించాలి.
సీటింగ్ కన్నా ఎక్కువ మంది విద్యార్థులను తరలించడం నిషిద్ధం.