TS Elections 2023: దేవరకొండ.. ఒకప్పుడు కాంగ్రేస్‌,కమ్యూనిస్టుల కంచుకోట..! | - | Sakshi
Sakshi News home page

TS Elections 2023: దేవరకొండ.. ఒకప్పుడు కాంగ్రేస్‌,కమ్యూనిస్టుల కంచుకోట..!

Oct 28 2023 1:56 AM | Updated on Oct 28 2023 11:39 AM

- - Sakshi

దేవరకొండ : దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు కంచుకోటగా గుర్తింపు పొందింది. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు సార్లు సీపీఐ, ఏడు సార్లు కాంగ్రెస్‌, ఒకసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం తొలుత జనరల్‌ స్థానంగా ఉండేది.. తర్వాత ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పాటైంది.

1999లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన ధీరావత్‌ రాగ్యానాయక్‌ మద్దిమడుగు దేవాలయం వద్ద జరిగిన నక్సలైట్ల కాల్పుల్లో మృతి చెందాడు. 2002లో ఉప ఎన్నికలు అనివార్యం కాగా రాగ్యానాయక్‌ సతీమణి ధీరావత్‌ భారతి రాగ్యానాయక్‌ను అన్ని పార్టీలు ఏకగ్రీవం చేశాయి.

నియోజకవర్గ పరిస్థితి ఇలా..
దేవరకొండ నియోజకవర్గం చందంపేట, నేరెడుగొమ్ము, దేవరకొండ, డిండి, పీఏపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి మండలాలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా గుడిపల్లి మండలం ఏర్పాటైంది. ఇక్కడ ప్రధానంగా అత్యధిక శాతం గిరిజన జనాభా కలిగి ఉంది. ఇక్కడి రైతులు పత్తి ఎక్కువగా పండిస్తారు. అంతేకాకుండా దేవరకొండ పట్టణంలోని ఖిల్లాకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

రేచర్ల పద్మనాయకుల ఏలుబడిలో దేవరకొండ ఖిల్లా ప్రఖ్యాతి గాంచింది. ఖిల్లా ప్రధాన ద్వారంపై గల పూర్ణకుంభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అధికార చిహ్నంగా ఉండేది. నియోజకవర్గంలో నక్కలగండి, ఏఎమ్మార్పీ, పెండ్లిపాకల రిజర్వాయర్‌, డిండి ప్రాజెక్టులు ప్రధాన నీటి వనరులను కలిగి ఉన్నాయి. దేవరకొండ మున్సిపాలిటీగా ఉంది.

ఎమ్మెల్యేగా బద్దుచౌహాన్‌ హ్యాట్రిక్‌..
దేవరకొండ ఎమ్మెల్యేగా సీపీఐకి చెందిన బద్దు చౌహాన్‌ వరుసగా 1985, 1989, 1994లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ 2004, 2014, 2018లో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రకుమార్‌కు టికెట్‌ కేటాయించడంతో మరోమారు ఎన్నికల బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement