సద్వినియోగం చేసుకోవాలి
ఏటా ఇబ్బందులు తప్పవు
మంద
వెనుక..
హిరమండలం: జిల్లాలో ప్రతిఏటా ఇలా మూగజీవాలు మృత్యువాత పడుతునే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, పిడుగుపాటు, కుక్కలు, అటవీ జంతువుల దాడిలో మృత్యువాత పడుతున్నాయి. పెంపకందారులకు లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. ఇలా ప్రమాదాలు, నష్టాలు జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు, ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం లేదు. పశుబీమా ఉన్నా పరిహారం దక్కని పరిస్థితి వారిది. జిల్లాలో గత రెండేళ్లుగా 500 వరకు గొర్రెలు, మేకలు మృత్యువాతపడినా.. పరిహారం మాత్రం అందలేదు. అదే సమయంలో గొర్రెలు, మేకల పెంపకందారులకు మూగజీవాలను మేపేందుకు అనుకూల పరిస్థితి జిల్లాలో లేదు. కొండలు, ప్రభుత్వ భూములు లీజుల రూపంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుండడంతో మూగజీవాలు మేపేందుకు సరైన సదుపాయాలు లేవు
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో 10 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో గొర్రెలు, మేకల మందల ద్వారా ఉపాధి పొందుతున్న కుటుంబాలు లక్షల్లోనే ఉంటాయి. వాటిని పెంచడం ద్వారా మాత్రమే కాదు.. మందల రూపంలో పొలాలు, తోటల్లో ఉంచితే రాత్రికి కొంత మొత్తం నగదును రైతులు చెల్లిస్తుంటారు. సేంద్రియ సాగు విధానంలో భాగంగా రైతులు ఎక్కువగా గొర్రెలు, మేకల మందలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఏటా వేసవి నుంచి ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటాయి. ఆ సమయంలో పిడుగుపాటుకు మూగజీవాలతో పాటు పెంపకందారులు సైతం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చిగురుటాకులా వణికిపోతుంటారు. ఇక ఖరీఫ్లో రైతులు వరి సాగుచేస్తుండడంతో పొలాలు ఖాళీగా ఉండవు. ఆ సమయంలో జిల్లాలో 200 కిలోమీటర్ల ఉన్న రైల్వేలైన్, అంతే దూరం ఉండే జాతీయ రహదారిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఆ సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగి మూగజీవాలు మృత్యువాత చెందుతుంటాయి.
బీమా భారమే..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువుల బీమా పథకం ఎందుకూ అక్కరకు రాకుండా పోతోంది. ప్రభుత్వం గొర్రెలు, మేకలకు సైతం పశువుల బీమా పరిహారం వర్తింపజేసింది. అయితే ఒక్కొ గొర్రె/మేకకు లైఫ్టైమ్ రూ.27లు కట్టాల్సి ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. 100 గొర్రెలు ఉండే రైతు ఏడాదికి రూ.2,700లు కట్టడం తలకు మించిన భారం. ప్రమాదంలో మృతిచెందితే కేవలం రూ.6 వేల బీమా వస్తుంది. జిల్లాలో గొర్రెలు 6.23 లక్షలు, మేకలు 2.77 లక్షలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పశుబీమా కట్టిన పెంపకందారుల సంఖ్య చాలా తక్కువ. ప్రమాదాలు జరిగినప్పుడు గొర్రెలు మృతి చెందిన సమయంలో పశుబీమా గురించి అడుగుతున్నారు అధికారులు. కట్టలేదని చెప్పడంతో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏటా పశువుల పెంపకందారులకు నష్టం తప్పడం లేదు. అందుకే ఎక్కువ మంది గొర్రెలు/మేకలను విక్రయించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటున్నారు. ఇప్పటికై నా గొర్రెల పెంపకందారుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
మూగజీవాలకు తరచూ ప్రమాదాలు, విపత్తులు
వందలాదిగా మృతి చెందుతున్న గొర్రెలు, మేకలు
తీవ్రంగా నష్టపోతున్న పెంపకందారులు
ప్రభుత్వ బీమా కూడా దక్కని వైనం
ఈనెల 3వ తేదీన పలాస సమీపంలో జాతీయ రహదారిపై లారీ ఢీకొని 32 గొర్రెలు మృతి చెందాయి. ఉదయం వేళలో గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొని మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం జరగడంతో గొర్రెల పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు.
గత నెల 27న హిరమండలం మండలంలో వంశధార రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో 35 గొర్రెలు మృతి చెందాయి. సరుగుడు తోటలో పురుగు మందు వేయగా తెలియక మంద అటువైపుగా ప్రవేశించింది. అక్కడ పచ్చగడ్డి మేయడంతో ఒక్కసారిగా మూగజీవాలు కుప్పకూలిపోయాయి.
ఈ ఏడాది మే 3న బూర్జ మండలంలోని కొరగాంలో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పొలంలో గొర్రెల మంద వేయగా వీధి కుక్కలు దాడిచేశాయి. మరికొన్నింటికి గాయాలయ్యాయి. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం జరిగింది.
గతేడాది డిసెంబర్ 2న పొందూరు మండలం కొంచాడ గ్రామంలో 40 గొర్రెలు మృతి చెందాయి. పొలంలో మంద వేసి ఉండగా వీధి కుక్కలు దాడిచేశాయి. దీంతో పెంపకందారులకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.
గొర్రెలు, మేకలు, పందులతో పాటు ఆవులు, గేదెలు తదితర పశువుల పెంచే పాడి రైతులు పశుబీమాను సద్వినియోగం చేసుకోవాలి. గొర్రె, మేక, పందికి ఒక్కో సంవత్సరానికి రూ.27లు చెల్లించి వాటికి ట్యాగ్ వేయించుకోవాలి. ప్రమాదంలో చనిపోయిన వాటికి బీమా సంస్థ రూ.6 వేల బీమా వర్తింపజేస్తుంది. పాడి రైతులు ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోవాలి.
– జి.కవిత, పశువైద్యాధికారి, ఎల్ఎన్పేట
ఏటా మాకు ఇబ్బందులు తప్పవు. వర్షాకాలంలో అయితే చిగురుటాకులా వణికిపోతాం. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో సైతం చాలా ఇక్కట్లు పడతాం. గొర్రెల పెంపకందారులు రానురాను తగ్గిపోతుండడానికి ఇదే కారణం. ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా అంతంతమాత్రమే.
– బి.లక్ష్మీనారాయణ,
గొర్రెల పెంపకందారుడు, కొరసవాడ


