ఇచ్ఛాపురం రూరల్: తేలుకుంచి గ్రామానికి ప్రతి ఏటా వస్తున్న విదేశీ పక్షుల సంరక్షణకు కృషి చేస్తానని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎం.మురళీకృష్ణ అన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంగళవారం తేలుకుంచి విదేశీ పక్షుల విడిది కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్షులు గుడ్లు పొదిగే సమయంలో ప్రత్యేకంగా తయారు చేసిన గూళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పక్షి పిల్లలను సంరక్షించేందుకు, మృత్యుబారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేలుకుంచి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ అధికారులు టి.దేవరాజు, భానుమూర్తి, సురేష్ తదితరులు ఉన్నారు.


