అంతా ఇష్టారాజ్యం | - | Sakshi
Sakshi News home page

అంతా ఇష్టారాజ్యం

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

అంతా ఇష్టారాజ్యం ● ఆదిత్యాలయ భూముల బదలాయింపులో ‘చేతివాటం’ ● విలువైన భూములను ముందే చక్కబెట్టేసిన వైనం ● ప్రాధాన్యతా క్రమంలో ‘నందల’ స్థలం కేటాయింపుపై అసంతృప్తి ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్న బాధితులు

● ఆదిత్యాలయ భూముల బదలాయింపులో ‘చేతివాటం’ ● విలువైన భూములను ముందే చక్కబెట్టేసిన వైనం ● ప్రాధాన్యతా క్రమంలో ‘నందల’ స్థలం కేటాయింపుపై అసంతృప్తి ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్న బాధితులు

అరసవల్లి:

అరసవల్లి ఆదిత్యాలయ భూముల వ్యవహారం ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయానికి ఎదురుగా ఉన్న పలు స్థలాలను ల్యాండ్‌ టు ల్యాండ్‌ విధానంలో తీసుకుని ఆలయానికి చెందిన విలువైన స్థలాలను ప్రైవేటు యజమానులకు కట్టబెడుతున్నారు. అయితే ఇదైనా సక్రమంగా జరుగుతోందా అంటే...అంతా అక్రమ మార్గమేనని బాధితులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. అరసవల్లి ఆలయానికి ఎదురుగా కీలకమైన ఓ ఇంటిని వదిలేసి.. పక్కనున్న ఇళ్లకు రేట్లు ఫిక్స్‌ చేసి నచ్చినోళ్లకు నచ్చినచోట స్థలాలను కేటాయించడంలో ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి. ప్రసాద్‌ చక్రం తిప్పినట్లుగా తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆలయానికి దాదాపుగా అన్ని విలువైన స్థలాలే అయినప్పటికీ రోడ్డుకు వెడల్పు అధికంగా ఉండే కమర్షియల్‌ స్థలాలను కేటాయించడమనే విషయంలోనే ‘అధిక మొత్తంలో డబ్బులు చేతులుమారినట్లు స్థానికంగా చర్చజోరందుకుంది. ఉన్నతాధికారుల పేషీకి ఇవ్వాలంటూ ఆలయ ఈవో నేరుగా ప్రైవేటు భూ యజమానుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా ఓ భూ యజమాని చెప్పుకొచ్చారు. దీంతో అరసవల్లి ల్యాండ్‌ టు ల్యాండ్‌ విధానంలో అవకతవకలు, అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

అన్నీ ఇచ్చేస్తే మిగిలేదెక్కడ?

ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న రెండు భవనాల సేకరణలో అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. ఇందులో ఒకరికి విలువైన (నందలు తయారీ స్థలం) స్థలం కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. మరొక యజమాని రమణమ్మకు చెందిన ఇల్లే అత్యంత కీలమైనప్పటికీ, వారికి కేటాయిస్తున్న బదలాయింపు స్థలాలపై ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. భూబదలాయింపు విధానంలో భాగంగా స్థానికులైన సలుగు శేఖర్‌కు చెందిన 12 సెంట్ల భూమికి బదులుగా మెయిన్‌ రోడ్డులో ఉన్న సర్వే నంబర్‌ 485/2లో 9.50 సెంట్లు (నందల తయారీ స్థలం) ఇవ్వడానికి నిర్ణయించారు. అయితే తాము ఆరుగురు వాటాదారులమని, మాకు పూర్తిగా నందల తయారి స్థలంలోనే కేటాయించాలంటూ బాధితులు అధికారులను కోరుతున్నారు. ఇక్కడే పెద్ద సమస్య తలెత్తింది. ముందుగా అనుకున్నట్లుగా నచ్చిన వారికి అత్యంత విలువైన భూములను కేటాయించేశారని విమర్శిస్తున్నారు. మిగిలిన భూముల విషయానికొస్తే.. పెద్దింటి పూర్ణ, బమ్మిడి కృష్ణారావులకు చెందిన 46 సెంట్లను తీసుకుని వారికి సర్వే నంబర్‌ 89/6లోని 37 సెంట్ల భూమితో పాటు వప్పంగి గ్రామ పరిసరాల్లో ఉన్న 592 గజాల స్థలాలను బదలాయింపుగా ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే మద్దుల సూర్యనారాయణ, రమేష్‌చక్రవర్తిలకు చెందిన 18 సెంట్ల స్థలానికి బదులుగా ఆలయానికి చెందిన చిన్నతోటలోని 14 సెంట్లను, అలాగు గంగు రామన్న కుటుంబానికి చెందిన 46 సెంట్ల స్థలానికి బదులుగా పెద్దతోటలోని 40 సెంట్లను బదలాయింపుగా ఇచ్చేసేలా దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. అయితే ప్రైవేటు వాళ్ల నుంచి మొత్తం 1.22 ఎకరాల భూములను ఆలయానికి చెందనుండగా...ఆలయానికి చెందిన 1.10 ఎకరాల విలువైన భూములు ఆయా ప్రైవేటు భూయజమానుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రైవేటు యజమానులతో ముందస్తుగా ‘డీల్‌’ కుదుర్చుకున్న సదరు అధికారి వ్యవహారంపై విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని స్థానికులు, బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నారని, అయితే లోపాయికారి ఒప్పందాలతో మిగిలిన వారికి నష్టం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు చేస్తారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement