● జల్లువలసలో టీడీపీ నాయకుల అండతో నిర్మాణం ● వత్తాసుగా నిలిచిన పోలీసులు
గార : గార పంచాయతీ జల్లువలస గ్రామంలో ఓ వీధికి ఉన్న గ్రావెల్ రోడ్డుపై అడ్డంగా గోడ నిర్మించడమే కాకుండా మిగిలిన స్థలంలో సొంతింటి నిర్మాణాన్ని ఓ వ్యక్తి చేపట్టాడు. ఇతనికి టీడీపీ నాయకుడి అండదండలు ఉండటంతో ఏకంగా 50 మంది పోలీసులు రక్షణగా నిలిచారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జల్లువలస గ్రామం నుంచి యాతవీధికి ప్రభుత్వ పోరంబోకు మీదుగా నడక దారి ఉంది. ఆ దారి స్థలాన్ని పుల్లటి నర్సునాయుడు అనే వ్యక్తి ఆక్రమణ చేయడంతో పాటు హైకోర్టుకు వెళ్లడంతో వాస్తవ నిర్ధారణ జరపాలని ఆదేశించింది. అప్పటి పంచాయతీ అధికారి ఆ స్థలం పోరంబోకుదని నివేదికివ్వడంతో రోడ్డు నిర్మాణం చేయాలని ఆదేశాలిచ్చింది. అనంతరం పంచాయతీలో చర్చించి 2023లో గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం నర్సునాయుడు టీడీపీ నాయకుల అండదండలతో ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. అంతేకాక ఇంటి నిర్మాణం కోసం శరవేగంగా పునాదులు జరుపుకుంటున్నాడు. దీనిపై యాతవీధి వాసులు గార పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చినా ఎస్ఐ తీసుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దౌర్జన్యానికి అంతు లేదా..?
యాత వీధి వాసుల పరిస్థితి తెలుసుకున్న వైఎస్సార్ సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు మంగళవారం జల్లువలస వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. 20 కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసి, 10 అడుగులున్న రోడ్డును ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఇంత దర్జాగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంతో పాటు వారికే పోలీసులు రక్షణగా ఉండటం బాధాకరమన్నారు. పాలనలో బాధితులకు న్యాయం జరగడం లేదని, తప్పు చేసిన వారికే అండదండగా ఉండటం సిగ్గు చేటన్నారు. దీనిపై న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు రఘురామ్, పుల్లటి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, మార్పు దుర్గా పృథ్వీరాజ్, ముంజేటి కృష్ణమూర్తి, పీస శ్రీహరిరావు, ఆరంగి రమణమూర్తి, శిమ్మ ధర్మరాజు, చింతల గడ్డెయ్య, కోట రామారావు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


