ఎచ్చెర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని ప్రభుత్వ ఐటీఐ స్కిల్ హబ్ సెంటర్‌లో దివీస్ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ అర్హత కలిగినవారు హాజరవ్వాలని సూచించారు. 18 నుంచి 30 సంవత్సరాల్లోపు యువకులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరవ్వాలన్నారు.
చేపల మృత్యువాతపై అధికారుల పరిశీలన
రణస్థలం: మండలంలోని నారువ, మెంటాడ పంచాయతీల పరిధి అక్కయ్యపాలెం దగ్గరలోని కందివలస గెడ్డలో చేపలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాలుష్య నియంత్రణ అధికారులు గెడ్డలోని నీటిని సేకరించారు. ల్యాబ్‌కు పంపించి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంతణ ఏఈ హరీష్ తెలిపారు.
ఆటో డ్రైవర్‌కు
6 నెలల జైలు శిక్ష
సారవకోట: పాలకొండ గ్రామానికి చెందిన శైలా మన్మధరావుకు సోమవారం పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జ్ ఎం.రోషిణి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ అనిల్ కుమార్ తెలిపారు. 2022లో సారవకోట గ్రామానికి చెందిన కూన పొట్టెమ్మను ఆటోతో ఢీకొని ఆమె మృతికి కారణమయ్యాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ లావణ్య కేసు నమోదు చేసి చార్జిషీటు వేశారు. దీనిపై వాదోపవాదనలు జరిగిన తర్వాత సోమవారం శైలా మన్మధరావుకు ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.
నేడు అరసవల్లిలో సహస్ర ఘటాభిషేకం
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సహస్ర ఘటాభి షేక సహిత వరుణయాగం, జపమహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ప్రకటించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి క్షేత్ర పాలకులైన శ్రీభువనేశ్వరి సహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో లోకకళ్యాణార్థం, వర్షాలు కురవాలని కోరుతూ ఈ అభిషేకాన్ని నిర్వహస్తున్నట్లుగా ప్రకటించారు.
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
హిరమండలం: మండలంలోని ఒక గ్రామంలో మానసిక దివ్యాంగురాలైన యువతిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పువ్వల దామోదరావు అనే వ్యక్తి ఇంటింటికీ వెళ్లి కరెంట్ బిల్లులు తీస్తుంటాడు. ఎప్పటిలాగే ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం ఒక గ్రామంలోని ఒక ఇంటికి బిల్లు తీసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఒక ఇంట్లో మానసిక దివ్యాంగురాలైన యువతిపై దామోదరావు అత్యాచారం చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
‘కరువు జిల్లాగా ప్రకటించాలి’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు కె.మోహన్‌రావు, జిల్లా అధ్యక్షులు పొందూరు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెలమల రమణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సుందరయ్య భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీటి వనరులు లేని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం రైతులకు ద్రోహం చేయడమేనన్నారు. పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లోనూ లోటు వర్షపాతంతో పాటు ఈ భూములకు వంశధార నీరు కూడా అందిన పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కరువు పరిస్థితి పట్టడం లేదని విమర్శించారు. జిల్లాలో కరువు మండలాలు ప్రకటించడంలో శాసీ్త్రయత లోపించిందని, ఇది రాజకీయ ప్రకటనగా ఉందని విమర్శించారు. లోటు వర్షపాతం ఉన్న మందస, ఇచ్ఛాపురం, కవిటి లాంటి మండలాలను కరువుగా ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తక్షణం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు, రాయితీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.


