టెక్కలి రూరల్: టెక్కలి మండలం వంగర గ్రామానికి చెందిన గిరిజన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించిన మేఘవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో బాధిత గిరిజన యువతి తనకు జరిగిన అన్యాయంపై హోంశాఖ మంత్రికి, ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రెండు రోజుల క్రితం సాక్షి పత్రికలో ‘నాయ్యం చేయకపోతే చావే శరణ్యం’ అనే శిర్షీకతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన టెక్కలి పోలీసులు మేఘవరం గ్రామానికి చెందిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు.
కారు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కాశీబుగ్గ: పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న కారు టోల్ గేట్ సమీపంలో అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొంది. కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో భద్రక్‌కు చెందిన మంగళ్ నాయక్, దీప్తి సాహు, దిలీప్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం జీజీహెచ్‌కు పంపించారు.
కోతి దాడిలో మహిళకు తీవ్రగాయాలు
మెళియాపుట్టి: మండల కేంద్రానికి చెందిన జమ్మ గోవిందమ్మ అనే మహిళపై కోతి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. సోమవారం బండార్లమ్మ వీధిలో కోతి హల్‌చల్ చేసింది. కోతి వెంబడించి దాడి చేయడంతో జమ్మ గోవిందమ్మ పడిపోయింది. కాలు.. చేయి విరిగిపోయింది. ఆమెను పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కోతులు పదేపదే దాడులు చేస్తున్నా అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


