చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డతండా పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి దేవాదుల రిజర్వాయర్‌లో ఆదివారం సాయంత్రం గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు కల్యాణ్ (26) అచూకీ సోమవారం రాత్రి 7 గంటల వరకు కూడా తెలియరాలేదు. కల్యాణ్ సికింద్రాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నేహితులతో కలిసి మల్లన్నగండి రిజర్వాయర్ చూసేందుకు రాగా, ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి వరకు గాలించినా ఆచూకీ తెలియరాలేదు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రెస్క్యూ టీం సభ్యులు స్థానిక ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ ఆదేశాలతో మరో రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టారు. రాత్రి 7 గంటల వరకు ఆచూకీ లభ్యం కాకపోవడం, బాగా చీకటికావడంతో వెనుదిరిగారు. మంగళవారం గాలింపు చేపడుతామని పోలీసులు తెలిపారు. కాగా, తమ కుమారుడు కనిపిస్తాడేమోనని తల్లిదండ్రులు పడాల భాస్కర్–నిర్మల కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరుగా విలపిస్తూ అక్కడే వేచి ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు గార్లగడ్డతండ సర్పంచ్ మాలోతు నవీన్ నాయక్ సొంత ఖర్చులతో వసతితో పాటు భోజన సౌకర్యం కల్పించారు.


