● నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియా కన్ను
● గ్రానైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్న వైనం
● ఇప్పటికే పేలుళ్ల ప్రయత్నాలు అడ్డుకున్న నిరసనకారులు
● ముఖ్యనేత కనుసన్నల్లోనే పనులన్నీ
కంచిలి:
నల్లరాయి కొండపై మైనింగ్ మాఫియా కన్ను పడింది. ఇప్పటికే భైరిపురం గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న కొండలో గ్రానైట్ నిక్షేపాలను అడ్డగోలుగా తవ్వుతూ దోచుకుంటున్నారు. తాజాగా నువాగడ రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నంబర్ 47లో ఉన్న నల్లరాయి కొండపై మైనింగ్ చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ ముఖ్య నేతతో మైనింగ్ వ్యాపారులు రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. తర్వాత ఈ పనులు మొదలు పెట్టేందుకు శ్యాంపిల్స్ సేకరణ, తవ్వకాల కోసం బాంబులు పెట్టేందుకు కొండకు డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక రైతులు, గిరిజనులు అప్రమత్తమయ్యారు. వెంటనే మండల సీపీఐ నాయకులను సంప్రదించి ఆ ప్రయత్నాలను అడ్డుకొని ప్రతిఘటించారు. దీంతో వారు అక్కడి నుంచి జారుకున్నారు.
దశాబ్దం నుంచి ఏర్పాట్లు
ఈ కొండలో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుసుకొని జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారులు దశాబ్ద కాలంగా దీనిపైన గురిపెట్టారు. దశల వారీ గా ఆ ప్రాంతంలో ట్రాన్స్‌పోర్టింగ్‌కు అవసరమైన రహదారి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొండ ప్రాంతానికి చేరుకోవడానికి ఇప్పటికే జలంత్రకోట నుంచి గోకర్ణపురం రోడ్డుకు నువాగడ నుంచి శాశ్వత తారు రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు నల్లరాయి కొండ నుంచి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి సర్వే చేసి ప్రతిపాదనలు కూడా చేశా రు. హైవే వరకు అవసరమైన రహదారి మార్గాన్ని దశలవారీగా నిర్మిస్తున్నారు. ఇలా ఈ కొండను సొంతం చేసుకొనేందుకు పక్కాగా ప్రణాళిక రచించి ముందుకెళుతున్నారు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తూ అవసరమైన పత్రాలు, తీర్మానాలు, అనుమతులు ఒక్కొక్కటిగా మైనింగ్ శాఖకు అందించి వ్యాపారులకు అనుకూలంగా లీ జులు మంజూరు చేస్తూ గిరిజనుల పొట్టకొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కొండ చుట్టుపక్కల శాసనాం గ్రామానికి చెందిన 30 మంది రైతులకు బీడీఆర్ పట్టాలను సుమారు పదిహేనేళ్లు కింద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అందజేయడంతో, వారంతా ఈ కొండ చుట్టుపక్కల కంది తదితర పంటల్ని సాగుచేస్తున్నారు. మరోవైపు నువాగడ పంచాయతీ పరిధి రాజాశాంతి నగర్‌కు చెందిన గిరిజనులు కొండకు మరోవైపు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ, అక్కడే నివాసాలు ఏర్పాటు చేసు కొని దశాబ్దాలుగా జీవిస్తున్నారు. వారంతా ఇక్కడ జరగబోయే విధ్వంసాన్ని తలచుకొని భయపడుతున్నారు.
లొద్దాలొద్ది రిజర్వాయర్‌కు దెబ్బ..
నల్లరాయి కొండ నుంచి వచ్చే వరద నీటితో సమీపంలో ఉన్న వివిధ చెరువులుతోపాటు లొద్దాలొద్ది రిజర్వాయర్‌కు కూడా సాగునీటి సేకరణ జరుగుతోంది. తవ్వకాల వల్ల ఈ రిజర్వాయర్ కింద సాగుచేస్తున్న 1100 ఎకరాల పంట పొలాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ నల్లరాయి కొండపై పూరి జగన్నాథస్వామి కొలువై ఉండేవారని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. శాసనాం గ్రామంలో గొండు సామాజిక వర్గం కులదైవం దేవత రాతి విగ్రహం ఇక్కడ ఉండటంతో పూజలు చేస్తుంటారు.
కూటమి కుట్రలు..
ఈ కొండలో ఖనిజ నిక్షేపాలు తరలించేందుకు ముఖ్య నేత అనుచరులతో కలిసి పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. కొండను సొంతం చేసుకొనేందుకు అవసరమైన అధికారుల మద్దతు కూడా పొందినట్లు భోగట్టా. మైనింగ్ చేపట్టిన తర్వాత గ్రానైట్ రాళ్లు లీజుదారులు వెలికితీసి, తీసుకెళ్లిన తర్వాత అక్కడ మిగిలిపోయిన వేస్ట్ మెటీరియల్‌ను కూడా స్థానిక కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కూడా నిర్ణయా లు జరిగినట్లు తెలుస్తోంది. గ్రానైట్ లీజుదారులకు, వేస్ట్ మెటీరియల్‌ను ముఖ్యనేత బంధువులుగా చెప్పుకొనే ఇద్దరు వ్యాపారులు వాటాలు ఫిక్స్ చేసుకున్నట్లు ఆయా వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ మెటీరియల్ సాయంతో జిల్లాలో జరిగే వివిధ భారీ నిర్మాణాలకు అవసరమైన రాళ్లు తరలించేందుకు ముఖ్యనేత బంధువులు ఇప్పటికే ఆయా నిర్మాణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొన్నట్లు భోగట్టా. పనులు సజావుగా సాగేందుకు పోలీసుల సాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
కొండ పరిసరాల్లోనే వ్యవసాయం
నల్లరాయి కొండ పరిసరాల్లోనే దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొంటూ, ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాం. ఇక్కడ భూములే మాకు జీవనాధారం. ఈ కొండలో తవ్వకాలు జరిపితే మా ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది.
– సవర విశ్వనాత్, రైతు, రాధాశాంతి నగర్
ఈ కొండే జీవనాధారం..
నల్లరాయి కొండ చుట్టూ ఉన్న భూమిని శాసనాం గ్రామానికి చెందిన 30 మంది గొండు జాతి వారికి బీడీఆర్ పట్టాలు ఇచ్చా రు. వాటిలో కంది తదితర పంటల్ని సాగుచేసుకొని జీవిస్తున్నాం. మాకు ఈ కొండే జీవనాధారం.
– జెన్నాలూచి, రైతు, శాసనాం గ్రామం


