అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎండ షాక్ గట్టిగానే తగిలింది. ఆదివారం ప్రత్యేకంగా ఆదిత్యున్ని దర్శించుకునేందుకు అరసవల్లి వచ్చిన భక్తులు స్థానికంగా ఆలయం ఎదుట అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. భానుని ప్రతాపం ఉదయం 9 గంటల నుంచి ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు.. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టిక్కెట్లతో అంతరాలయ దర్శనం చేయించారు. అలాగే సామా న్య దర్శన భక్తులకు కూడా సజావుగా దర్శనానికి చర్యలు చేపట్టారు. ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం పలు ఏర్పాట్లు చేసినప్పటికీ ఎండలో మాత్రం భక్తులకు అవస్థలు తప్పలేదు. ఆలయం ముందు టెంట్లు వేయకపోవడంతో ఎండ తీవ్రతకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. అలాగే జలప్రసాదం పేరిట మంచినీటిని అందించినా, సరిపడలేదనే విమర్శలు వినిపించా యి. అలాగే కేశఖండన శాలలో మొక్కులకు, మరుగుదొడ్ల వద్ద వినియోగానికి ప్రత్యేకంగా రుసుము వసూలు చేయడంపై భక్తులు తమ ఫీడ్‌బ్యాక్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే రికార్డుల్లోకి ఫిర్యాదులు చేరకుండా ఆలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు కుటుంబ సమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు.


