ఐలు రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి ముగ్గురు ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఐలు రాష్ట్ర కమిటీకి జిల్లా నుంచి ముగ్గురు ఎన్నిక

Oct 5 2026 12:51 AM | Updated on Oct 5 2026 12:51 AM

ఆమదాలవలస: నెల్లూరులో శని ,ఆదివారాల్లో నిర్వహించిన ఐలు(ఆల్‌ ఇండియా లాయర్స్‌ అసోసియేషన్‌) రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన న్యాయవాదులు బొడ్డేపల్లి మోహనరావు, డీడీ రమణరావు, ఎం.అప్పారావులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మహాసభల్లో వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొని సంస్థ కార్యకలాపాలు, కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా జిల్లా నుంచి ముగ్గురికి చోటు లభించిందని వారు తెలిపారు.

జిల్లా అండర్‌–19 క్రికెట్‌ జట్టు ఎంపికలు రేపు

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలుర క్రికెట్‌ జట్టు ఎంపికలను ఈనెల 6వ తేదీన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా నిర్వహించనున్నామని జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు చల్లా జగదీష్‌, జీఎం జ్యోతిరాణి తెలిపారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్‌ సంఘం క్రికెట్‌ నెట్స్‌లో ఈ ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 2008 జనవరి ఒకటి తర్వాత జన్మించి, 9,10 తరగతులతో పాటు ఇంటర్మీడియెట్‌ చదువుతున్న వారు మాత్రమే అర్హులని స్పష్టంచేశారు. ఇక్కడ ఎంపిక చేసిన జిల్లా బాలురు జట్టును చిత్తూరు జిల్లా నగరిలోని కేవీకే గ్రౌండ్స్‌ వేదికగా ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 70వ ఏపీ రాష్ట్రస్థాయి అండర్‌–19 బాలుర క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ రాణించిన క్రీడాకారులను జాతీయ స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్‌/కాలేజ్‌ ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డులతో వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్‌, షూ ధరించి హాజరుకావాలని వారు సూచించారు.

‘దివ్యాంగులకు అండగా ఉంటాం’

శ్రీకాకుళం: దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో ఎదిగి ఆత్మగౌరవంతో జీ వించేలా అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని సన్‌రైజ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులు రూ.1.50 కోట్లతో, ఆలింకో భాగస్వామ్యంతో 230 మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు 130 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 100 జాయ్‌స్టిక్‌ వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులందరికీ అవసరమైన పరికరాలు పూర్తిగా అందే వరకు ఏటా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి స్వాభిమాన్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ కేవలం పరికరాలు ఇవ్వడమే కాకుండా, వీటి ద్వారా వారి జీవితాల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసి, చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి క ల్పించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు.

రైతు మోటారు సర్వీస్‌ వైర్లు చోరీ

రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి నుంచి దేరసాం వెళ్లే రహదారి మధ్యలో ఉన్న రైతు అప్పలసూరి రెండు మోటార్‌ సర్వీస్‌ వైర్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి కట్‌ చేశారు. ఇలా ఈ ప్రాంతంలోని పలువురు రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్‌ వైర్లను కట్‌ చేసి ఇటీవల పట్టుకుని వెళ్లిపోయారు. దీంతో రైతులు తెల్లవారుజామున వెళ్లి మోటార్లు ఆన్‌ చేద్దామని చూస్తే వైరు లేదు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్‌ వైరు దొంగిలించి అమ్మకాలు జరిపేందుకు ఇలా చేస్తున్నారని రైతులు చెప్పారు. ఇటీవల లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం, లావేరు, గోవిందపురం, భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్‌ సర్వీస్‌ వైర్లు, రాగి పట్టుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement