శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. జిల్లా పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియెట్ విద్య అధికా రులను సమన్వయం చేసుకుని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సెలక్షన్స్ ట్రయల్స్‌కు ప్రభుత్వం కనీస నిధులను సైతం విదల్చనప్పటికీ.. అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆదివారం వెయిట్‌లిఫ్టింగ్, హ్యాండ్‌బాల్, బాక్సింగ్, సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల్లో వివిధ వేదికలుగా వేర్వేరు విభాగాల్లో ఎంపికలు పూర్తి చేశారు. పోటీలకు క్రీడాకారులు పోటెత్తుతున్నారు. వెయిట్‌లిఫ్టింగ్ ఎంపికలు శ్రీకాకుళం పెద్దపాడులోని శ్రీ రెయ్యమ్మతల్లి వ్యాయామశాల వద్ద, హ్యాండ్‌బాల్ ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంలో, బాక్సింగ్ ఎంపికలు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో, సాఫ్ట్‌బాల్ అండర్–19 ఎంపికలు నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జూడో ఎంపికలను శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో, రెజ్లింగ్ ఎంపికలు పెద్దపాడులోని నిర్వహించి పూర్తిచేశారు. త్వర లో తుది జట్లను ప్రకటించనున్నట్టు జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు చల్లా జగదీష్, జీఎం జ్యోతిరాణి పేర్కొన్నారు.


