చిల్పూరు:
జనగామ జిల్లా చిల్పూరు మండలం గార్లగడ్డతండ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్‌లో ప్రమాదశాత్తు ఆదివారం సాయంత్రం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పడా ల కల్యాణ్ (26) సికింద్రాబాద్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 మంది స్నేహితులతో కలిసి భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి, యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లాడు. అనంతరం మల్లన్నగండి రిజర్వాయర్ చూసేందుకు వెళ్లాడు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో పంపింగ్ కొనసాగుతుండడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంది. కొద్దిసేపు నీటిలో ఆడి పంపింగ్ దగ్గరకు వెళ్లి సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కల్యాణ్ ఒక్కసారిగా నీటిలోకి జారిపడ్డాడు. తోడుగా వచ్చిన స్నేహితులు అరవగా చుట్టుపక్కల ఉన్న స్థానికులు వచ్చేసరికే నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో కనిపించకుండా పోయాడు.
సమాచారం అందుకున్న ఫైర్, పోలీసు సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పంపింగ్ నిలిపివేశారు. రెస్క్యూ టీమ్ గాలించినా ఆచూకీ తెలియలేదు. రాత్రి కావడంతో గాలింపు నిలిపివేశారు.


