శ్రీకాకుళం క్రైమ్ :
అది విశాఖలోని మధురవాడ. ఓ ఇంటిలో
భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. భార్య తన నగలను పుట్టింటికి ఇచ్చేస్తోందని భర్త చికాకుపడిపోతున్నాడు. ఈ గొడవ ఆఖరకు పోలీస్‌స్టేషన్ వరకు చేరింది.
జి.సిగడాంలో మరో ఇంటిలో కుటుంబ సభ్యులు తరచూ తగువులాడుకుంటున్నారు. కొద్దిపాటి బంగారం నువ్వు తీశావంటే.. నువ్వే తీశావంటూ వారిలో వారే ఘర్షణ పడుతున్నారు.
ఈ సారి శ్రీకాకుళం టూ టౌన్‌పోలీస్‌స్టేషన్ పరిధి.
ఓ ఇంటి ఇల్లాలు తన బంగారం బ్యాంకులోనే ఉందని, కానీ లేదని మేనేజర్ బుకాయిస్తున్నాడని ఆరోపించింది. ఆఖరకు పోలీసులకూ ఇలాగే చెబుతూ దాదాపు గొడవకు దిగింది.
రణస్థలం సమీపంలోని ఊరిలోనైతే ఓ ఉద్యోగిని తన నల్లపూసల హారం కనబడడం లేదని భర్తను అనుమానించడంతో ఇద్దరి మధ్య మాటలు నిలిచిపోయాయి.
ఇవేవీ కుటుంబ కలహాలు కావు.. వున్నాన రాంబాబు అనే దొంగ పెట్టిన గొడవలంటే నమ్మి తీరాల్సిందే. హస్త లాఘవం చూపి బంగారం కాజేయడమే కాదు.. ఇంటి వాళ్లపైనే అనుమానం వచ్చేలా దొంగతనం చేయడం ఈ చోరుడి ప్రత్యేకత. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 120 దొంగతనాలకు పాల్పడిన రాంబాబుది విజయనగరం జిల్లా చీపురుపల్లి. దొంగల్లో కలహాల దొంగలు వేరయా అన్నట్టు రాంబాబు పనితీరు చెప్పాలంటే మరో ఉదాహరణ ఉంది.
గత ఏడాది జేఆర్ పురం సీఐ అవతారం బృందం రాంబాబును పట్టుకుంది. దాదాపు 1250 గ్రాముల బంగారం రికవ రీ చేశారు. కేశవరావు పేటలోని ఓ ఇంటిలో బంగారం తీశానని రాంబాబు చెబితే.. లేదంటే లేదంటూ ఆ ఇంటి వారు తగువులాడడం విశేషం. కనీసం వారు పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు. అప్పుడు రాంబాబు తాపీగా.. వారు బీరువా తాళాలు ఎక్కడ పెడతారో. ఆ బీరువా రంగు ఏమిటో చెప్పడంతో ఆ ఇంటివారికి దిమ్మ తిరిగిపోయింది. నగలన్నీ పరిశీలించాక దొంగతనం జరిగిందన్న విషయం అప్పుడు తెలుసుకున్నారు. మరోసారి ఏం జరిగిందంటే..
జిల్లా కేంద్రం సమీపంలోని ఓ గ్రామానికి సంక్రాంతి రోజు ల్లో ఓ పోలీసు జీపు వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. ‘మీ ఇంటిలో దొంగతనం జరిగింది. రెండు గాజులు పోయా యి’ అని పోలీసు చెప్పగా.. మా ఇంటిలో దొంగతనం జరగడమేమిటి అని ఆ ఇల్లాలు నిష్టూరమాడింది. వెళ్లి బీరువా చూడండి అని సూచించగా.. సార్ అన్నీ ఉన్నాయి గానీ రెండు గాజులు మాత్రం లేవు సార్ అంటూ ఆందోళనగా చెప్పింది. అదీ రాంబాబు చోరీ తీరు.
జనం బలహీనతే అతడి బలం..
సాధారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు ఇంటిలో ఏదో మూల దాస్తుంటారు. ఆ బలహీనతే రాంబాబు బలం. బాగా సన్నగా ఉండే రాంబాబు ముందుగా గేటుకున్న గ్రిల్స్ మధ్యలోంచి అలవోకగా వరండాలోకి పట్టపగలు ఎవరూ గమనించనప్పుడు ప్రవేశిస్తాడు. షూ ర్యాక్, ఎలక్ట్రికల్ మీటర్ బోర్డు, పూలకుండీలు, కిటికీల్లో మనం పెట్టే తాళాలను పసిగట్టి మెయిన్ డోర్ తలుపు తీసేస్తాడు. ఏ వస్తువునూ ముట్టుకోడు, చిందరవందర అన్నది అస్సలు ఉండదు. కనీసం అతడి వేలిముద్రలు కూడా పడవు. బీరువాలో ఎన్ని నగలున్నా నాలుగైదు తులాలుండే ఒకటి రెండు వస్తువులే తీస్తాడు. అలా తీస్తే.. ఆ చోరీ ఇంటి వారి పనే అయి ఉంటుందని భావిస్తారని అతడి నమ్మకం. అలా అతడు చోరీ చేసినా పోలీసుల వరకు వెళ్లని కేసులెన్నో ఉన్నాయి. ఇలాంటి చోరీ కేసు నమోదైతే పోలీసులకు మొదట గుర్తొచ్చే పేరు రాంబాబే.
మాజీ రంజీ ప్లేయర్
క్రికెట్‌లో నైపుణ్యమున్న రాంబాబు రంజీ జట్టు ఎంపిక విషయంలో కోచ్ మోసం చేయడంతో తట్టుకోలేక వ్యసనాలకు బానిసయ్యాడు. జల్సాలకు, బెట్టింగ్‌లకు దొంగతనాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల జేఆర్ పురం సీఐ ఎం.అవతారం 10 చోరీ కేసుల్లో భాగంగా అరెస్టు చేయడంతో రాంబాబు మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు.
పోలీసులకూ మస్కా కొట్టి..
పోలీసులకు చిక్కినట్టే చిక్కి మస్కా కొట్టి పారిపోవడంలోనూ రాంబా బు దిట్టే. పోలీసులతో అతి చనువు ప్రదర్శించి విచారణలో ఏ ప్రశ్నలడిగినా సహకరించి సిబ్బందికి తనపై అంచనాలకు మించి నమ్మకాన్ని పెంచేస్తాడు. స్టేషన్‌లో రాత్రి సమయంలో సిబ్బంది నిద్రపోయినా, వాష్‌రూమ్‌కు వెళ్లినా ఇక అంతే.. త్రు టిలో తప్పించుకుని పారిపోతాడు. ఆనందపురం, చీపురుపల్లి, విజయనగరం, ఎచ్చెర్లలో ఇలానే చేశాడు.
మీరు తాళాలు ఎక్కడ పెడుతున్నారు..
మీరు బయటకు వెళ్లే క్రమంలో ఇంటి తాళాన్ని పూలకుండీల్లో, షూర్యాక్‌లలో, కరెంట్ మీటర్ బాక్సుపైన పెడుతున్నారు. ఈ కథనం చదివిన తరువాతైనా అలా చేయడం మానుకోండి.


