వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం రామకృష్ణాపురానికి చెందిన అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వరరావు ఢాకాలో జరిగే ఆసియా కప్‌కు ఆడేందుకు పయనమయ్యాడు. దీంతో శనివారం క్రికెటర్ వెంకటేశ్వరరావుకు గ్రామస్తులు క్రికెట్ బ్యాట్ బహూకరించి కప్ గెలిచి రావాలంటూ ఎయిర్‌పోర్టుకు సాగనంపారు. ఈ నెల 5వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆసియా కప్ ఎంపికలు, కోచింగ్ ఉన్నందున బంగ్లాదేశ్‌లోని ఢాకా పయనమయ్యాడు. నవంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఢాకాలో ఆసియా దేశాలైన ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో క్రికెట్ అసోషియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబీఐ) ఆధ్వర్యంలో పోటీలు జరగనున్నాయి.
కాశీబుగ్గ: పలాస మండలం శాసనాం సమీపం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ఓ గుర్తు తెలియని లారీ బీభత్సం సృష్టించింది. పలాస నుంచి కేశుపురం వైపు 70 గొర్రెలతో రాత్రి 12 గంటల సమయంలో వెళ్తున్న మందపైకి అమాంతం దూసుకువచ్చింది. ఈ ఘటనలో 60 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. తమ జీవాలను మేత అనంతరం స్వగ్రామమైన కేశుపురం తీసుకెళ్తుండగా లారీ ఢీకొట్టి, ఆగకుండా వెళ్లిపోయిందని కాపరులు చెబుతున్నారు. ఈ ఘటనలో కాపరుల్లో ఒకరైన గుమ్మి డి హరికృష్ణ (55) గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళం పరిధిలోని జాతీయ రహదారి సీపాన్నాయుడు పరిసర ప్రాంతంలో శనివారం ఓ అరుదైన బావురు పిల్లి మృతిచెందింది. గుర్తు తెలియని వాహనం ఒక్కసారిగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సాధారణ పిల్లి కంటే కాస్తా పెద్ద పరిమాణంలో ఉండే ఈ బావుర పిల్లి శరీరంపై చారలు, మచ్చలు ఉండి చిరుతపులి పిల్లలా పోలి ఉంటుంది. ఇది ఎక్కువుగా చిత్తడి నేలలు, పంట పొలాలు, పొదల్లో దాక్కోని ఉంటుందని, రాత్రి సమయాల్లోనే సంచారం ఎక్కువగా చేస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
– శ్రీకాకుళం రూరల్


