కరువు ప్రాంతాలకు రూ.2లక్షల కోట్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతాలకు రూ.2లక్షల కోట్లు కేటాయించాలి

Oct 4 2026 5:23 PM | Updated on Oct 4 2026 5:23 PM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎల్‌నినో ప్రభావం వల్ల కరువు కోరల్లో ఉన్న గ్రామీణ ప్రాంత పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.2 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిర్ల ప్రసాద్‌, గంగరాపు సింహాచలం డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీ పథకం రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథాతథంగా అమలు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు కె.ఎల్లయ్య, జి.ఈశ్వరమ్మ, టి.నారాయణరావు, అన్నపూర్ణ, తవిటినాయుడు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఏఆర్‌ డీఎస్పీగా వెంకటరమణ

శ్రీకాకుళం క్రైమ్‌ : ఎచ్చెర్లలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగ కొత్త డీఎస్పీగా కె.వెంకటరమణను నియమిస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన స్వస్థలం విజయనగరం కాగా విశాఖపట్నం సిటీ ఏఆర్‌ ఆర్‌ఐగా పనిచేస్తూ ఇటీవలే డీఎస్పీగా పదోన్నతి పొందారు. మంగళగిరి పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేసి జిల్లాకు రానున్నారు. జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీగా ఉన్న ఎల్‌.శేషాద్రినాయుడుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చినా పోస్టింగ్‌పై స్పష్టత ఇవ్వలేదు. శేషాద్రినాయుడు 2024 మార్చిలో జిల్లాకు డీఎస్పీగా వచ్చి మూణ్నెళ్ల కిందట ఏఎస్పీగా పదోన్నతి పొందారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నాయకులు జి.ధర్మారావు, బి.శ్రీరామ్‌ రెడ్డి, ఎల్‌.రవి, పి.కృష్ణారావు, ఎస్‌.వి.రమణారావు కోరారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బి.లవరాజులకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 సంవత్సరాలుగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.5,745 మాత్రమే చెల్లిస్తుండగా, కనీస వేతనంగా రూ.26,000 చెల్లించాలని కోరారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కూలీల హాజరు నమోదు, ప్రభుత్వ ఆదేశాల అమలు వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 5 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శారద, బి.శ్యామలరావు, మోహన్‌, భాను, కె.కళ్యాణి, వి.రామ్‌జీ, చిట్టి అసిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో చోరీ

కంచిలి: మండల కేంద్రం కంచిలి పంచాయతీ పరిధిలోని బలియాపుట్టుగ గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పార్వతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. శనివారం ఉదయం ఆలయం తెరవడానికి వచ్చిన అర్చకుడు జనార్దన ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు సమచారం అందించారు. ఇటీవలే ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేయగా, ఇంతలోనే దొంగతనం జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆలయ గర్భగుడి ప్రవేశ ద్వారంలో ఉన్న తలుపుల తాళాలను పగులగొట్టి దుండగులు ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న వస్తువులేవీ దొంగిలించలేదు. పక్కనే ఉన్న స్టోర్‌ రూమ్‌ తాళాలు పగులగొట్టి అందులో భద్రపరిచిన భక్తులు విరాళాల హుండీని తెరిచి అందులో ఉన్న సొమ్మును తీసుకెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement