సారవకోట: బస్సులో ప్రయాణిస్తున్న వారైనా, బండిపై వెళ్తున్న వారైనా సారవకోట సమీపించిందంటే చాలు కాసేపు ఆగి చుట్టుపక్కల చూసి తీరుతారు. ఆ సువాసన అలాంటిది మరి. కరకరలాడే ఇక్కడి చుప్పులు, అన్న ఆదరువుగా అదుర్స్ అనిపించే అప్పడాలకు అంతా అభిమానులే. 1947 నుంచి ఇక్కడ చుప్పుల తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. గతంలో ఎక్కువ కుటుంబాలు ఈ చుప్పులు, అప్పడాల తయారీ పై ఆధారపడి ఉండేవి. అయితే కాలక్రమేణ గ్రామాల్లో సైతం కూలీలు దొరక్కపోవడంతో వీటి తయారీని నిలుపుదల చేసి ఇతర పనుల్లోకి చేరుతున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ తయారు చేస్తున్న చుప్పులు, అప్పడాలకు మంచి గిరాకీ ఉంది. దాదాపు 15 కుటుంబాల వారు ఇదే వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ తయారైన చుప్పులు మండల కేంద్రంలో ఉన్న ప్రతి దుకాణంలో లభ్యమవుతాయి. అంతే కాదు చుట్టు పక్కల గ్రామాలు, పాతపట్నం, జలుమూరు, నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, కోటబొమ్మాళి తదితర మండలాలకు వాహనాలతో వెళ్లి అక్కడ దుకాణదారులకూ విక్రయిస్తున్నారు.
లోకల్ టేస్ట్


