రణస్థలం : రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎచ్చెర్ల మండలం అజ్జరాం గ్రామానికి చెందిన దంపతులు బురిడీ రమణ, గౌరమ్మ తమ కుమార్తె దేవికతో కలిసి ద్విచక్ర వాహనంపై అత్తవారి గ్రామమైన రణస్థలం మండలం చిల్లపేటరాజం పంచాయతీ బొడ్డపాడు గ్రామానికి బయలుదేరారు. రణస్థలంలో ఫ్లై ఓవర్ పనుల వద్దకు వచ్చేసరికి వీరి ద్విచక్రవాహనాన్ని ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు.


